Begin typing your search above and press return to search.

రెండు చోట్లా ఓడిపోయినా నీవు మాట్లాడలేదా పవన్ ?

జనసేనాని ఉప ముఖ్యమంత్రి కాగానే మొదట్లో అధికార దర్పం చూపించలేదు అనుకున్నారంతా.

By:  Tupaki Desk   |   2 Nov 2024 3:27 AM GMT
రెండు చోట్లా ఓడిపోయినా నీవు మాట్లాడలేదా పవన్ ?
X

జనసేనాని ఉప ముఖ్యమంత్రి కాగానే మొదట్లో అధికార దర్పం చూపించలేదు అనుకున్నారంతా. ఇది బాగుందని మెచ్చుకున్న వారూ ఉన్నారు. ఆయన పద్ధతిగా ప్రజాస్వామ్య స్పూర్తితో ఉంటున్నారు అని కూడా కితాబు ఇచ్చారు ప్రజాస్వామ్య ప్రియులు. అయితే నాలుగైదు నెలలు గడిచాక పవన్ తీరు మళ్లీ జనసేనానిగా మారుతోంది అని అంటున్నారు.

ఏలూరు సభలో పవన్ మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య స్పూర్తికి తగినవి కావు అని అంటున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తాయి. అధికార పక్షంలో ఉన్న వారు బాధ్యతగా ఉండాలి. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికార పక్షం విపక్షాలకు ప్రశ్నించే అధికారం ఉండకూడదనుకుంది. ఫలితం అంతా చూశారు కదా. ఇపుడు పవన్ కూడా వైసీపీ నేతలు ఎక్కువగా మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

అంటే ప్రశ్నించకూడదా పవన్ అని వైసీపీ శ్రేణులు అంటున్నారు. వైసీపీ అధికార ట్విట్టర్ లో అయితే పవన్ కళ్యాణ్ మహిళల మీద అంత ప్రేమ ఉంటే 36 వేల మంది వైసీపీ ఏలుబడిలో మిస్ అయ్యారు అని పదే పదే ఆరోపణలు చేశారు కదా అధికారంలోకి వచ్చి ఏమి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో ఈ రోజుకీ మహిళల మీద అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నా పవన్ మాట్లాడారా అని నిలదీస్తున్నారు. వైసీపీ సంగతి పక్కన పెడితే పవన్ ఏలూరు సభలో అన్న మాటలు ఒకసారి పరిశీలిస్తే వైసీపీ నేతల నోళ్ళు మళ్లీ లేస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చినా వారి నోళ్ళు ఇంకా మూతపడడం లేదని కూడా అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చేశారు. తమది మెతక ప్రభుత్వం కాదని అన్నారు.

దీనిని బట్టి చూస్తే పవన్ కోరినట్లుగా విపక్షం మాట్లాడాలా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఓటమి చెందిన వారు ఎవరూ మాట్లాడకూడదు అంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహా ఎవరూ మాట్లాడకూడదా అని కూడా సందేహాలు వస్తున్నాయి. వైసీపీకి 11 సీట్లు అయినా వచ్చాయి. కానీ పవన్ రెండు చోట్లా తానే ఓటమి పాలు అయ్యారు కదా అని గుర్తు చేస్తున్నారు.

పవన్ ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఓటమి చెందినా ఆనాడు వీధి పోరాటాలు చేశారు కదా అని కూడా గుర్తు చేస్తున్నారు మరి పవన్ నాడు మౌనంగా ఏమీ కూర్చోలేదు కదా అని అంటున్నారు. ఎవరు అయినా అధికారం కోసమే మాట్లాడుతారు, దాని కోసమే పోరాటాలు చేస్తారు అన్నది పవన్ కి తెలియదా అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఆ విషయం పవన్ కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు అనుకోవాలి కదా అంటున్నారు. కూటమిని చారిత్రాత్మకమైన తీర్పు జనాలు ఇచ్చారని చెబుతున్న పవన్ అదే సమయంలో ఎవరూ ప్రశ్నించకూడదు అనడమేంటి అని కూడా అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుని చూసిన వారు ఆయన గతాన్ని మరచిపోయారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ నోళ్ళు మూయిస్తామని అనడంలో ఆంతర్యం ఆయనకే తెలియాలని అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక్క సీటూ గెలవని వారు కూడా ప్రశ్నించవచ్చు అని అంటున్నారు. సరే కూటమి ప్రభుత్వం ఇబ్బందులలో ఉంది అయినా పధకాలను అమలు చేస్తామని అంటున్నారు.

అది బాగానే ఉంది కానీ వైసీపీ వెంటనే పథకాలు అమలు చేయమని డిమాండ్ చేయడాన్ని తప్పుగా ఎలా చెబుతారు అని అంటున్నారు. ఇక మహిళల అత్యాచారాలు అన్నవి నాడూ నేడూ జరుగుతున్నాయని వాటికి పరిష్కారం పాలకులు కనుగోవాలి తప్పించి రాజకీయాలు చేయడమెందుకు అన్నది కూడా కామెంట్స్ గా వస్తోంది. ఏది ఏమైనా పవన్ మాట్లాడిన మాటలు అయితే బూమరాంగ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.

అధికారంలో ఉన్న వారు అయితే జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు. విపక్షాలను రెచ్చగొడితే వారికే మైలేజ్ వస్తుందని అది గతంలో వైసీపీ చేసిన చందంగానే ఇపుడు కూటమి చేస్తే ఇబ్బందులో పడుతుందని కూడా సూచిస్తున్నారు.