బాబే సీఎం....నో చాన్స్ అంటున్న పవన్ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు.
By: Tupaki Desk | 7 April 2025 5:13 PMజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు. ఆయన అల్లూరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం గురించి ప్రస్తావించారు.
ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని అభివృద్ధి మీదనే ఫోకస్ పెడుతోందని అన్నారు చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని మరోసారి కీర్తించారు. బాబు నాయకత్వం ఏపీకి చాలా అవసరం అన్నారు. చంద్రబాబు మరో పదిహేనేళ్ళ పాటు ఏపీకి సీఎం గా ఉంటారని పవన్ స్పషంగా చెప్పారు.
అంతే కాదు ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ళ పాటు సుస్థిరంగా పాలిస్తుందని అన్నారు. బాబు అభివృద్ధి విషయంలో ఎంత నిబద్ధతో ఉంటారు అంటే గిరిజన ప్రాంతాలలో రోడ్ల కోసం తాని నిధులు అడిగితే వెంటనే మంజూరు చేశారు అని అన్నారు. ఈ సందర్భంగా బాబుకు ధన్యవాదాలు అని కూడా చెప్పారు.
ఇక తన గురించి మాట్లాడుతూ ఏపీకి సీఎం కావాలన్న కోరిక ఇప్పట్లో లేదని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వమే అని ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. తమ హయాంలోనే గిరిజన ప్రాంతాలలో రోడ్లు వస్తున్నాయని చెప్పరు.
అరకులో తమ కూటమిని గెలిపించలేదని అయినా అభివృద్ధి విషయంలో తాము ఎక్కడా వివక్ష చూపకుండా చేస్తున్నామని పవన్ చెప్పారు. ఏపీలో 1117 గిరిజనల గ్రామాలు ఇంకా మౌలిక సదుపాయాలకు దూరంగానే ఉంటున్నాయని పవన్ అన్నారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబే మరో పదిహేనేళ్ళ పాటు సీఎం అని పదే పదే ప్రకటించడం పట్ల చర్చ సాగుతోంది. చంద్రబాబు సైతం మళ్ళీ మేమే అని ఎక్కడా చెప్పడంలేదు. తనకు ఇది నాలుగవసారి ముఖ్యమంత్రి అని అంటున్నారు తప్ప అంతకు మించి మాట్లాడడం లేదు.
కానీ పవన్ మాత్రం బాబు ఏపీకి అవసరం అని అంటున్నారు. ఆయనే ఎప్పటికీ సీఎం అని కూడా చెబుతున్నారు. తన విషయంలో కూడా సీఎం ఆకాంక్షను అంతవరకూ పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు మదిలో ఏముందో తెలియదు కానీ పవన్ మాత్రం పదే పదే తన ప్రకటనల ద్వారా బాబు సీఎం గా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అలా బాబు సీఎం గా ఉంటేనే తమ మద్దతు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.
చంద్రబాబు వయసు పరంగా చూసినా ఆయన అన్నేళ్ళ పాటు ఇదే మాదిరిగా చురుకుగా పని చేయగలరా అన్నది కూడా ఉంది. కానీ పవన్ ఆయన వయసు ఏ అరవై దగ్గరో ఆగిందని భావిస్తూ ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు ఈ ప్రకటనల వల్ల జనసేన అధినేత వ్యూహాత్మకంగానే ఉంటున్నారు అని అంటున్నారు.
తనకు సీఎం పదవి కాదు వైసీపీకే ఏపీలో అధికారం దక్కదని ఆయన ఈ విధంగా చెప్పదలచుకున్నారని అంటున్నారు అలాగే కూటమిలో లోకేష్ కాబోయే సీఎం అని వినిపిస్తున్న నినాదాలకు కూడా ఇలా చెక్ చెబుతున్నారా అన్నది మరో చర్చ. ఇక బాబు తరువాత ఎటూ బలమైన క్యాండిడేట్ గా పవన్ కూటమిలో ముందుకు వస్తారు. పైగా బీజేపీ దన్ను కూడా ఉంటుంది అందుకే ఆయన 15 ఏళ్ళు బాబు సీఎం అని అంటున్నా దాని వెనక వ్యూహాలూ ఉన్నాయి. అవి అప్పటి సమయానికి అనుగుణంగా మార్చి చెప్పుకున్నా ఇబ్బంది లేనివిగా ఉన్నాయని అంటున్నారు.