'సీజ్ ది షిప్' ఇష్యూలో బిగ్ ట్విస్ట్... పవన్ వాట్ నెక్స్ట్?
అవును... కాకినాడ పోర్టుకు వచ్చిన ఆఫ్రికాకు చెందిన నౌక స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేయమని చెప్పే అధికారం పవన్ కల్యాణ్ కు లేదనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 2 Dec 2024 6:00 AM GMTగత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లోనే కాదు, ట్విట్టర్ లోనూ ట్రెండింగ్ గా మారిన ఇష్యూ "సీజ్ ది షిప్"! కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమంగా రవాణా అవుతుందనే ఆరోపణలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షిప్ ను సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిన్న మాట "సీజ్ ది షిప్" వైరల్ గా మారింది.
పవన్ చెప్పిన "సీజ్ ది షిప్" అనే మాట సోషల్ మీడియలో ట్రెండ్ అయ్యింది. మరోపక్క ఈ వ్యవహారంపై ప్రభుత్వంలో తీవ్ర కలకలం మొదలైంది. అసలు డిప్యూటీ సీఎం హోదాలో షిప్ ను సీజ్ చేయమనే అధికారం పవన్ కల్యాణ్ కు ఉంటుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆ హక్కు కేవలం కస్టమ్స్ అధికారులకు మాత్రమే ఉంటుందని అంటున్నారు!
అవును... కాకినాడ పోర్టుకు వచ్చిన ఆఫ్రికాకు చెందిన నౌక స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేయమని చెప్పే అధికారం పవన్ కల్యాణ్ కు లేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో పలు చుక్కుముడులు ఎదురవుతున్నాయని అంటున్నారు. నౌకలో రేషన్ బియ్యం ఉన్నాయని, అందుకు సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
అయితే... ఒకదేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను నిబంధనల ప్రకారం సీజ్ చేసే హక్కు డిప్యూటీ సీఎం కు ఉండదని.. ఆ అధికారం కేవలం కస్టమ్స్ అధికారులకు మాత్రమే ఉంటుందని అంటున్నారు. అదికూడా ఆ నౌకలో స్మగ్లింగ్ వస్తువులు గుర్తిస్తేనే అని చెబుతున్నారు. అప్పుడు కూడా కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిపివేస్తారు!
అయితే... ఈ స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ బియ్యం రావని అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. అందువల్ల.. నిషేధిత జాబితాలోలేని ఈ బియ్యం ఉన్న నౌకను సీజ్ చేయలేమని.. ఒకవేళ అలాంటి పనిచేస్తే సరికొత్త సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారని తెలుస్తోంది. దీంతో... ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.
అడ్మిరల్టీ కేసు!:
వాస్తవానికి సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే.. దీనికి సంబంధించిన కేసును అడ్మిరాల్టి కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుందని అంటున్నారు. అయితే... ఈ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపుల్లో వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... మరి రేషన్ బియ్యం ఎగుమతి ఫిర్యాదును ఈ కోర్టు స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. పైగా... ఇప్పటివరకూ బియ్యం స్మగ్లింగ్ పై ఇంతవరకూ ఏ దేశంలోనూ ఏ అడ్మిరల్టీ కోర్టులోనూ కేసు నమోదు కాలేదని అంటున్నారు. మరోవైపు బియ్యం కేసు స్మగ్లింగ్ లోకి రాదు కాబట్టి.. ఈ విషయంలో కస్టమ్స్ అధికారులు తిరస్కరణ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!