కూటమిలో కామ్రెడ్ కుంపటి... ఏం జరిగింది..!
అయితే.. ఈ వంద రోజుల పాలన ఒక ఎత్తు అయితే.. గత నెలలో చోటు చేసుకున్న పరిణామాలు మరో ఎత్తు
By: Tupaki Desk | 10 Oct 2024 3:10 AM GMTఏపీలో కూటమి సర్కారు పాలనకు 100 రోజులు పూర్తయ్యాయి. అయితే.. ఈ వంద రోజుల పాలన ఒక ఎత్తు అయితే.. గత నెలలో చోటు చేసుకున్న పరిణామాలు మరో ఎత్తు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున రగడ చేశాయి. అయితే.. ఈ విషయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. మరింత దూకుడు చూపించారు.
ఏకంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజులు దీక్ష చేశారు. దుర్గగుడి మెట్లు శుభ్రం చేశారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.(అలిపిరి నుంచి). ఈ పరిణామాలపై తాజాగా కామ్రెడ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ వెనుక బీజేపీ ఉందన్నదివారి ఉవాచ. అంతేకాదు.. రాష్ట్రంలో మరో రెండేళ్లకు.. చంద్ర బ బును గద్దె దింపి.. ఆ సీటును బీజేపీ వశ పరుచుకునే అవకాశం ఉందని కూడా సీపీఎం సీనియర్ నేత శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
అంతే కాదు.. బీజేపీ.. చాలా వ్యూహాత్మకంగా పవన్‌ను తన దారిలోకి తీసుకువెళ్లిందని.. అందుకే చేగువేరా కాస్తా.. శ్రీవారికి పరమ భక్తుడు అయిపోయాడని కూడా వ్యాఖ్యానించారు. దీని ఉద్దేశం బీజేపీ విస్తరించడ మేనని కామ్రెడ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ బీజేపీ, ఆర్ ఎస్సెస్ ట్రాప్ లో పడ్డారని కూడా విమర్శించా రు. పవన్ వైఖరి ఏపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందనన్నారు. ఇదిలావుంటే, ఏపీలో మతపరమైన ఉద్రిక్తత లను రెచ్చగొట్టడం ద్వారా తెర వెనక బీజేపీ ఆరెస్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయనే విషయంపై కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.
ఇప్పుడు కామ్రెడ్ చేసిన వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేయలేం. ఎందుకంటే.. గతంలో మహారాష్ట్ర విషయంలోనూ శివసేన ను చీల్చడంలోనూ.. ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడంలోనూ.. అమిత్‌షా పాత్ర అందరికీ తెలిసిందే. అయితే.. ఆ రేంజ్‌లో కాకపోయినా.. బీజేపీ తలుచుకుంటే ఏమైనా జరగొచ్చన్న వాదన కూడా ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న టెక్నికల్ ఇష్యూలను గమనిస్తే.. టీడీపీకి ఒంటరిగానే 134 సీట్లు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం అయితే లేదు. కానీ, కమ్యూనిస్టుల వాదనను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.