ఆడా ఉంటా ఈడా ఉంటా... అదెలా పవన్ ?
ఇపుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ని విశ్లేషిస్తే పవన్ ఎందుకు ఇలా చెప్పారు అన్నది చర్చించాల్సి ఉంటుంది. పవన్ ఉన్నది అధికార కూటమిలో ఆయన అధికారంలో భాగంగా ఉన్నారు.
By: Tupaki Desk | 26 Feb 2025 4:30 PM GMTరుద్రమదేవి మూవీలో గోన గన్నరెడ్డి పాత్రలో అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అని. అది చాలా పాపులర్. అలాంటి డైలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోట వస్తోంది. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తామే అధికార పక్షం. తామే ప్రతిపక్షం అని అన్నారు.
దానికి ఒక రోజు ముందు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాలీ అంటే జనసేనకు వచ్చిన 21 సీట్ల కంటే ఒక్కటి అదనంగా అయినా రావాలని మెలిక పెట్టారు. అపుడే వైసీపీకి విపక్ష హోదా అని చెప్పారు. ఈ అయిదేళ్లు విపక్ష హోదా రానే రాదు అని తెగేసి చెప్పారు.
ఇపుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ని విశ్లేషిస్తే పవన్ ఎందుకు ఇలా చెప్పారు అన్నది చర్చించాల్సి ఉంటుంది. పవన్ ఉన్నది అధికార కూటమిలో ఆయన అధికారంలో భాగంగా ఉన్నారు. తాను స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉంటూ రెండు మంత్రి పదవులను తన పార్టీకి తీసుకున్నారు. అలా ప్రభుత్వంలో భాగమైన పార్టీకి ప్రతిపక్షంగా ఉండాలన్నా కుదురుతుందా అన్నది ఒక ప్రశ్న.
అంతే కాదు, ప్రభుత్వం అంటే సమిష్టి బాధ్యత. ప్రభుత్వంలో ఉంటూ వ్యతిరేకిస్తామంటే అసలు కుదరదు అది రాజ్యాంగ రీత్యా కూడా కూడని వ్యవహారం. మరి ప్రభుత్వం అన్నీ బాగా చేస్తోందని ఒక వైపు చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం అన్నది జనసేనకు ఏ మాత్రం అయ్యే పని కాదు.
అలా ప్రతిపక్ష పాత్ర జనసేన ఎలా పోషిస్తుందో అన్నది ఒక పెద్ద సందేహంగానే ఉంటుంది. మరో వైపు చూస్తే కనుక ఏ ప్రభుత్వం అయినా తప్పులు చేస్తే గట్టిగా పట్టుకుని నిలదీసేది ప్రతిపక్షం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఒక్కరు ఉన్నా ఇద్దరు ఉన్నా వారు ప్రతిపక్షమే. ప్రభుత్వాన్ని విమర్శించే పక్షం ప్రతిపక్షం అన్నదే ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రంగా చెప్పుకోవాలి.
అది కూడా నిరంతరం వాచ్ డాగ్ మాదిరిగా ప్రభుత్వాన్ని పరిశీలిస్తూ విమర్శలు చేయాలి. మరి ప్రభుత్వంలో ఉంటూ నిరంతరం తానున్న సర్కార్ నే విమర్శించడం జనసేన వల్ల అవుతుందా అలా చేసినా జనాలకు అది ప్రతిపక్షంగా కనిపిస్తుందా అన్నది ఒక చర్చగానే ఉంది.
ఇక మరో విషయం తీసుకుంటే పవన్ అన్న మాటలలో బట్టి ఎపుడైనా టీడీపీతో ఇబ్బందులు వచ్చి వేరు పడితే అపుడు ప్రతిపక్ష హోదా కచ్చితంగా ఆ పార్టీకే దక్కుతుంది. అది కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గానే దక్కుతుంది. కేబినెట్ ర్యాంక్ తోనే దక్కుతుంది.
అంటే పవన్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా మంత్రిగానే రాజ్యాంగం ప్రకారం అధికారం కేబినెట్ హోదా ఉంటాయి. ఆయన విపక్ష నేతగా ఉన్నా అదే హోదా ఉంటాయి. అందువల్ల పవన్ హోదాకు అధికారాలకు ఏ విధంగానూ ఇబ్బంది లేని ఈ రెండు పదవుల విషయంలో ఆయన ఊగిసలాడుతూ వైసీపీని నో చాన్స్ అంటున్నారా అన్నదే చర్చగా ఉంది.
ఏది ఏమైనా పవన్ ఆడా మేమే ఈడా మేమే అన్నా కూడా టెక్నికల్ గానే కాకుండా ఏ ఇతర విషయాల పరంగా చూసుకున్నా కూడా అది జరిగే వ్యవహారం కాదు. ప్రతిపక్షం అన్నది ఉండాల్సిందే. అది ప్రభుత్వం మీద విమర్శలు పదునుగా చేయాల్సిందే. సో ఏపీ అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు అయితే మూడు పార్టీల కూటమి కట్టి అధికారంలోకి వచ్చినపుడు నాలుగో పార్టీగా వైసీపీ కూటమిని వ్యతిరేకించే పార్టీ అయినపుడు సహజసిద్ధమైన ప్రతిపక్షం వైసీపీ అవుతుంది తప్ప జనసేన కానే కాదు.
మాటలకు ప్రకటనలకు తామే అధికార పక్షం తామే ప్రతిపక్షం అని ఎన్ని అయినా చెప్పవచ్చు కానీ జనాలు కూడా వాటిని సీరియస్ గా తీసుకోరు అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి అటు అధికారంలోకి రానీయకుండా ఇటు ప్రతిపక్షంగా కూడా కానీయకుండా పవన్ వేస్తున్న స్ట్రాటజీ బాగానే ఉండొచ్చు. కానీ జనాలు మాత్రం అధికార పక్షాన్ని ప్రశ్నించాలని వైసీపీనే కోరుతారు. వైసీపీనే విపక్షంగా గుర్తిస్తారు అన్నది మరవరాదు. ఈ విషయంలో జనాలకు అయితే కచ్చితమైన క్లారిటీ ఉంది.