Begin typing your search above and press return to search.

వరద... ఏపీ మంత్రులు వర్సెస్ తెలంగాణా మంత్రులు పని విధానం !

ముఖ్యంగా మంత్రులు అక్కడా ఇక్కడా ఎలా పనిచేస్తున్నారు అన్న దాని మీద కూడా జనాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 9:29 AM GMT
వరద... ఏపీ మంత్రులు వర్సెస్ తెలంగాణా మంత్రులు పని విధానం !
X

రెండు తెలుగు రాష్టాలకు ఎపుడూ పోలిక ఉంటూనే ఉంటుంది. ఒకనాడు ఉమ్మడి ఏపీగా ఉంది కాబట్టే ఈ పోలిక. ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చి పడ్డాయి. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి వచ్చాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్లు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంత్రులు అక్కడా ఇక్కడా ఎలా పనిచేస్తున్నారు అన్న దాని మీద కూడా జనాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఏపీ తెలంగాణాలలో ఇపుడు వరదలా సీజన్ నడుస్తోంది. వరదలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బంది అని కూడా కాదు, నరకం చూస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఒక వైపు ఆస్తులు మరో వైపు పంట పొలాలు ఇలా ఏది చూసినా నష్టమే కనిపిస్తోంది.

అయితే ఇపుడు చర్చ జరుగుతోంది ఏంటి అంటే ఏపీ తెలంగాణాల మధ్య ఏవరు బాగా పని చేస్తున్నారు అని. ఎవరు జనాల వద్దకు వెళ్ళి తమ పనితనాన్ని బాగా చూపించుకున్నారు అని. మామూలు రోజులలో ఎవరూ కనిపించకపోయినా ఫర్వాలేదు కానీ ఇది తుఫాను సమయం, వరదలతో జనాలు అల్లాడుతున్న నేపథ్యం ఉంది.దాంతో ప్రజల వద్దకు బాధ్యత కలిగిన ప్రభుత్వం మంత్రులు వెళ్లాల్సిందే. వారిని ఓదార్చాల్సిందే. చేతనైన సాయం చేయాల్సిందే.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంత్రుల పనితీరు మీద బిగ్ డిబేట్ సాగుతోంది. అయితే తెలంగాణా మంత్రులు దగ్గర ఉండి బాగా పనిచేశారు అని ఒక మాట వినిపిస్తోంది. వాళ్ళు ముందే అలెర్ట్ చేసి చాలా వరకూ నష్టాన్ని ఆపగలిగారు అని అంటున్నారు. ఏపీలో మంత్రులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వారు ఉన్నారు అని కూడా అంటున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే యాక్టివ్ గా ఉంటూ వరద ప్రాంతాలలో పర్యటించారు అని కూడా అంటున్నారు. మరి సీఎం కి సహకరించాల్సిన మంత్రులు కానీ అధికారులు కనీ తగిన విధంగా వ్యవహరించలేదు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబే ఓపెన్ అయి అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని ఫైర్ అయ్యారు. మరి సీఎం స్థాయి వ్యక్తి ఇలా అధికారుల మీద మాట్లాడారు అంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించవచ్చు అని అంటున్నారు.

మంత్రుల సంగతి పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక ఉచిత స్టేట్మెంట్ ఇచ్చారు. తాను వరద ప్రాంతాలలో పర్యటిస్తే సహాయ పనులకు ఆటంకం ఏర్పడుతుంది అని పవన్ అనడం కూడా చిత్రంగా ఉంది అని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మోకాల్లోతు వరద నీటిలో దిగి జనాలతో మమేకం అయితే రాని ఇబ్బంది డిప్యూటీ సీఎం వెళ్తే వస్తుంది అని ఆయన అనడం మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగడమే కాదు, సోషల్ మీడియాలోనూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదు అని పవన్ అన్నారు. తాను సాయపడాలి కానీ అదనపు భారం కాకూడదు అని ఆయన అన్నారు. ఈ లెక్కన చూస్తే చంద్రబాబు టూర్ చేస్తూ సహాయ చర్యలకు ఆటంకం కలుగచేస్తున్నారు అని అనుకోవాలా అన్నదే చర్చగా ఉంది.

ఇంకో వైపు చూస్తే బాబు కేబినెట్ లో ఇరవై నాలుగు మంది దాకా మంత్రులు ఉన్నారు. అందులో కొందరు తప్ప మిగిలిన వారు పెద్దగా రియాక్ట్ కాలేదు. బాబు హెచ్చరికలతో ఇపుడు ఒక్కొక్కరూ కదులుతున్నారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. నిజానికి ఏడున్నర పదుల వయసు కలిగిన చంద్రబాబుకు మంత్రులు అంతా అండగా ఉండాలి. ఆయనతో పాటుగా అడుగులు వేస్తూ వరద ప్రభావిత ప్రాంతాలలో మరింత ముమ్మర సాయం చేయాలి.

కానీ ఏపీ మంత్రుల తీరే సెపరేట్ అన్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. చంద్రబాబు ఉన్నారు కదా అన్నీ ఆయనే చూసుకుంటారు అని ఆలోచించి ఇలా చేస్తున్నారా లేక అవగాహన లోపమా కో ఆర్డినేషన్ సమస్యా అన్నది తెలియదు కానీ తెలంగాణాతో పోల్చుకుంటే ఏపీలో మాత్రం మంత్రులు పనితీరులో వెనుకబడ్డారు అనే అంటున్నారు. దీంతో వరద నష్టం కష్టం మరింతగా పెరిగింది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయితే తెలంగాణా మంత్రులలో కనిపించింది అన్నది నెటిజన్లు సాదర జనాల మాటగా ఉంది. ఇప్పటికైనా దీనిని చూసి మరింతగా అలెర్ట్ కావాల్సి ఉందని అంటున్నారు.