Begin typing your search above and press return to search.

హోం మంత్రి అనితకు పవన్ హెచ్చరిక అసలు టార్గెట్ ఇదేనా?

ఇందుకు అనిత టార్గెట్ అయ్యారంటున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు సూటిగా చెప్పలేని విషయాన్ని అనిత పేరుతో ఆయన చెప్పినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా

By:  Tupaki Desk   |   5 Nov 2024 7:27 AM GMT
హోం మంత్రి అనితకు పవన్ హెచ్చరిక అసలు టార్గెట్ ఇదేనా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాజకీయాల్లో చిన్న పిల్లాడిగా అభివర్ణించే వారు కనిపిస్తారు. అపరిపక్వత అధినేతగా ప్రచారం చేసే వారేం తక్కువ కాదు. నిజానికి పవన్ ను అర్థం కంటే కూడా అపార్థం చేసుకునే వారే కనిపిస్తారు. నిజాయితీగా వ్యవహరిస్తూ.. వ్యవస్థలో మార్పు కోసం తపించే గుణం కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ నేరాలు.. ఘోరాలపై మాట్లాడిన సందర్భంగా గత ప్రభుత్వంలో పోలీసులు తన లాంటి వారి విషయంలో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటూ.. తీవ్రమైన నేరాల్ని చేసే వారి విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు.

తాను పంచాయితీరాజ్ మంత్రినని.. అలానే హోం మంత్రి అనిత కూడా తాను హోం మంత్రి అన్నట్లు వ్యవహరించాలని.. కఠిన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై తీవ్రంగా రియాక్టు కావాలన్న విషయాన్ని చెప్పేశారు. అవసరమైతే హోం మంత్రిత్వ శాఖను తీసుకోవటానికి సిద్ధమంటూనే.. తాను కానీ హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే సినిమా మరోలా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకురావటం కనిపిస్తుంది.

ఇదంతా చూసినప్పుడు.. పవన్ అసలు లక్ష్యం హోంమంత్రి అనిత కంటే కూడా అంతకు మించిన అంశమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హోం మంత్రి అనితకు ఉన్న పరిమితులు పవన్ కు తెలుసా? తెలిసిన నేపథ్యంలో తాను ప్రశ్నించటం ద్వారా హోంమంత్రికి మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలా ప్రభుత్వంపై తనదైన శైలిలో ఒత్తిడిని తీసుకొచ్చారా? అన్నది అసలు ప్రశ్న.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. పోలీసు అధికారుల తీరుపైనా విమర్శలు వస్తుండటం కనిపిస్తుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులోనూ పోలీసుల అసమర్థత.. నిఘా వర్గాల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించటం తెలిసిందే. వివేకా హత్య జరిగిన వేళలో.. చంద్రబాబు సర్కారు ఆత్మ రక్షణలో పడిందే తప్పించి.. వాస్తవాల్ని వెల్లడించలేదు. దీనికి కారణం పోలీసింగ్ ఫెయిల్యూరేనని చెబుతారు. చంద్రబాబు మంచి పాలనా దక్షత ఉందని చెప్పినా.. పోలీసింగ్ విషయంలో మాత్రం తప్పులు దొర్లే పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి. ఇదే పవన్ కు ఆగ్రహాన్ని కలిగించిందన్న వాదన వినిపిస్తోంది.

అలా అని చంద్రబాబు వైఫల్యాన్ని నేరుగా ఎత్తి చూపకుండా.. పోలీసుల తీరును తప్పు పట్టటమేకాదు.. పోలీసుల్ని కంట్రోల్ చేసే విషయంలో హోం మంత్రి సమర్థంగా వ్యవహరించలేదన్న విషయాన్ని చర్చకు తేవటం ద్వారా.. ఒక ఝులక్ ఇచ్చారని చెప్పాలి. అదే సమయంలో పోలీసింగ్ విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు వర్కువుట్ కాదన్న సంకేతాల్ని తనదైన రీతిలో చెప్పి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. పోలీసింగ్ తీరు.. పోలీసుల వ్యవహారశైలి.. పోలీస్ శాఖను డీల్ చేసే విషయంలో ప్రభుత్వ పరంగా ఉన్న లోపాల్ని తన మాటలతో చెప్పారని చెప్పాలి.

ఇందుకు అనిత టార్గెట్ అయ్యారంటున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు సూటిగా చెప్పలేని విషయాన్ని అనిత పేరుతో ఆయన చెప్పినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పవన్ వ్యాఖ్యల లక్ష్యం.. అందరికి కనిపించే అనిత కాదని.. ప్రభుత్వాధినేతగా చెబుతున్నారు. అదే సమయంలో అధికారంలో లేనప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును గుర్తు చేయటం.. చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవాల్ని ప్రస్తావించటం ద్వారా.. పోలీసింగ్ ను డీల్ చేసే తీరులో మార్పు రావాలన్న బలమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.