అదే పవన్ తో ఉన్న సమస్యా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని మాత్రమే విన్నప్పుడు.. ఆయన మాటలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి.
By: Tupaki Desk | 5 Nov 2024 7:15 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని మాత్రమే విన్నప్పుడు.. ఆయన మాటలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. అదే రీతిలో ఆయనకు రోటీన్ గా జరిగే చాలా పరిణామాలు ఆయనకు తెలీవా? అన్న సందేహం వస్తుంది. అన్ని తెలిసి మరి మాట్లాడారు? అనుకుంటే అసలు మర్మం ఏమిటన్నది ప్రశ్న. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపైనా.. తీవ్రమైన నేరాల విషయంలోనూ.. పోలీసుల పనితీరు మీదా పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. సాక్ష్యాత్తు హోం మంత్రి అనితపైనా కూడా కామెంట్స్ చేసారు . ఆమె పని తీరు మెరుగుపడాలన్న అభిలాషను వ్యక్తం చేయటమే కాదు.. పవర్ ఫుల్ గా ఉండాలని స్పష్టం చేశారు.
సంచలనాల కోణంలో పవన్ కల్యాణ్ మాటల్ని తీసుకుంటే.. హోం మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే హైలెట్ అవుతాయి. కానీ.. పవన్ మాట్లాడిన మొత్తం ప్రసంగాన్ని విన్నప్పుడు మాత్రం ఆయనలోని ఆగ్రహం వెనుకున్న అసలు కారణం అర్థమవుతుంది. తీవ్రమైన నేరాలపై చర్యలు ఎందుకు లేవన్న ప్రశ్నతో పాటు.. హోం మంత్రిగా వ్యవహరించే వారు మరింత దూకుడుగా ఉండాలన్నట్లుగా పవన్ మాటలు ఉన్నాయి.
ఇక్కడే పవన్ ను ప్రశ్నించే పరిస్థితి. గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్ని చూసినప్పుడు.. స్వతంత్రంగా.. స్వేచ్ఛగా హోంశాఖను నిర్వర్తించిన మంత్రి ఉన్నారా? అన్నదే ప్రశ్న. పేరుకు హోం మంత్రి అని పేరుకు ఉండటమే తప్పించి.. ఆ శాఖకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాలు మొత్తం ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉంటాయన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలీకుండా ఉంటుందా? అన్నది ప్రశ్న. ఒకవేళ ఆ మాత్రం తెలీదన్నదే నిజమైతే.. పాలనా పరమైన పరిమితులు.. దాని స్ట్రక్చర్ గురించి అర్జెంట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ తెలిసి మరీ మాట్లాడారన్నప్పుడు.. ఆయన్ను తప్పు పట్టాల్సిందే. ఎందుకుంటే.. ఒక నేతను మంత్రిని చేసే అవకాశం ముఖ్యమంత్రికే ఉంటుంది. అలాంటప్పుడు ఆయనకు తగినట్లుగా వ్యవహరించటమే తప్పించి.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఉండదు. పేరుకు హోం మంత్రే తప్పించి.. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సంకేతాలకు ఆధారంగానే పనులు జరగాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఉన్న స్వేచ్ఛ వేరు. ఆయన పేరుకు పంచాయితీరాజ్ మంత్రి మాత్రమే కావొచ్చు. ఆయన మాటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విలువను ఇస్తారు. అవసరమైతే రెండు అడుగులు వెనక్కి వేయటానికి వెనుకాడరు.
అలాంటి స్వేచ్ఛ.. పవన్ లాంటి వారికే ఉంటుంది తప్పించి.. మిగిలిన మంత్రులకు ఉండదన్న విషయాన్ని పవన్ గుర్తించాల్సి అవసరం ఉంది. ఒకవేళ.. నిజంగానే హోం మంత్రి పని తీరు బాగోలేకుంటే.. తన వద్దకు విషయాన్నీ తీసుకెళ్ళచ్చు .కానీ.. అలాంటివి చేయటం పవన్ కు ఇష్టం ఉండదు. అలా అని తన గుండెల్లోని ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని తగ్గించుకోలేరు. అందుకే.. ఆయన అలా బరస్ట్ అయ్యారని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ సగటు రాజకీయ నేత ఏ మాత్రం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. పిఠాపురం నియోజకవర్గంలో చేసిన ప్రసంగంలో సొంత పార్టీ నేతలు మాత్రమే కాదు పార్టీకి చెందిన కార్యకర్తల్ని సైతం ప్రశ్నించటం కనిపిస్తుంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సిందేమంటే.. కొన్నేళ్లుగా నడుస్తున్న కొన్ని దుష్ట సంప్రదాయాలకు చరమగీతం పాడాలి. అది కూడా ఒక పద్దతి ప్రకారం మాత్రమే.ఆ విషయాన్ని ఆయన ఎప్పటికి తెలుసుకుంటారు?