వైసీపీని వదిలేది లేదు.. : పవన్ మరోసారి!
ఈ నిధులు మళ్లించిన వారు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టేది లేదంటూ.. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా పవన్ హెచ్చరికలు జారీ చేశారు.
By: Tupaki Desk | 22 Nov 2024 12:30 PM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నాయకులకు అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. వైసీపీ నేతలను వదిలేది లేదన్నారు. ''అన్నింటిలోనూ అవకతవకలే'' అని పవన్ చెప్పారు. ''గత ప్రభుత్వం ఏం చేసిందంటే..అన్నింటిలోనూ అవకతవకలు చేసింది. అనేక నిధులను దారి మళ్లించారు'' అని పవన్ చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్‌సమాధానాలు చెప్పారు.
ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ ఆధారిత పథకమని పవన్ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారిని కూడా 100 రోజలపాటు పనిలోకి తీసుకునే వెసులుబాటు ఈ పథకానికి మాత్రమే ఉందన్నారు. దీనిలో ఎలాంటి నైపుణ్యం అవసరం లేదన్నారు. కేంద్రం అనేక కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని అయితే.. ఈ మొత్తాన్ని ఎలాంటి లెక్కలు, పద్దులు కూడా లేకుండా జగన్ సర్కారు దారి మళ్లించిందని తెలిపారు. ప్రతి రూపాయినీ వెలికి తీసే పనిని చేపట్టామన్నారు.
ఈ నిధులు మళ్లించిన వారు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టేది లేదంటూ.. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా పవన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో పనులు పారదర్శకంగా చేపడుతున్నట్టు తెలిపారు. కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇస్తున్నామన్నారు. అవినీతికి పాల్పడిన నేతలనేకాదు.. వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.