Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూపై వివాదం... పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూపై తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:01 AM GMT
తిరుమల లడ్డూపై వివాదం... పవన్  కల్యాణ్  కీలక వ్యాఖ్యలు!
X

గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూపై తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ సర్కార్ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారాని, జంతువుల కొవ్వు వాడారంటూ ఆరోపణలు వెలుగులోకి రావడం, దీనిపై వైసీపీ ఘాటుగా స్పందించడంతో ఈ విషయం పీక్స్ కి చేరింది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు.

అవును... తిరుమల లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెపాలని.. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాసం కొవ్వు) కలిపినట్లు గుర్తించిన విషయంపట్ల తీవ్రంగా కలత చెందామని మొదలుపెట్టిన పవన్... వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు!

ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో "సనాతన ధర్మరక్షణ బోర్డు" ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో అన్ని వర్గాల వారితోనూ చర్చ జరగాలని.. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా అంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు.

కాగా.. వైఎస్ జగన్ హయాంలో తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనే, గొడ్డు కొవ్వు కలగలిసి ఉండోచ్చనే అనుమానాన్ని గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.డీ.డీ.బీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపిన సంగతి తెలిసిందే.

దీనిపై పెద్ద ఎత్తున దుమరం రేగుతోంది. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడుస్తుంది!