Begin typing your search above and press return to search.

అది.. 'ధ‌ర్మం'పై దాడి: చిలుకూరు ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

హైద‌రాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కుడు.. సీఎస్ రంగ‌రాజ‌న్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు చేసిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 10:17 AM GMT
అది.. ధ‌ర్మంపై దాడి:  చిలుకూరు ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌
X

హైద‌రాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కుడు.. సీఎస్ రంగ‌రాజ‌న్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు చేసిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈ దాడిని ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణపై చేసిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ``ఇది ఒక వ్య‌క్తిపై జ‌రిగిన దాడి కాదు. మొత్తం ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌పై జ‌రిగిన దాడిగా భావించాలి`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. రంగ‌రాజ‌న్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని తెలిపారు.

ఇది ఒక వ్య‌క్తిపై జ‌రిగిన దాడిగా కొంద‌రు పేర్కొంటున్నార‌ని.. కానీ, హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణకు న‌డుం బిగించి.. కొన్ని ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్న రంగ‌రాజ‌న్‌పై జ‌రిగిన దాడిని యావ‌త్ హిందూ ధ‌ర్మంపై జ‌రిగిన దాడి గా గుర్తించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఈ విష‌యంపై తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త శుద్ధితో విచార‌ణ జ‌రిపించాల‌ని.. రామ‌రాజ్యం అనే సంస్థ పేరుతో కొంద‌రు దుండ‌గులు చేసిన దాడి వెనుక ఎవ‌రున్నారో.. నిగ్గు తేల్చాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

ఈ దాడిని తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మూక‌దాడి వెనుక ఎంత‌టి వారు ఉన్నా.. వ‌దిలి పెట్టొద్ద‌ని సూచించారు. సనాత‌న ధ‌ర్మం కోసం.. రంగ‌రాజ‌న్ ప‌రిత‌పిస్తున్నార‌ని.. త‌న‌కు ఆయ‌నే ప్రేర‌ణ‌ని.. టెంపుల్ మూమెంట్‌ను తీసుకురావడం వెనుక ఆయ‌న ఎంతో కృషి స‌ల్పార‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. రంగ‌రాజ‌న్ లాంటి హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం పాటు ప‌డేవారిపై దాడి జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.