Begin typing your search above and press return to search.

పవన్‌ దీక్ష అందుకు కాదట!

అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని పవన్‌ పరిశీలించారు. దేవుడి భోజనం చేశారు

By:  Tupaki Desk   |   2 Oct 2024 7:59 AM GMT
పవన్‌ దీక్ష అందుకు కాదట!
X

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ.. జనసేనాని, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలోని అలిపిరి నుంచి పాదయాత్రగా బయలుదేరి అక్టోబర్‌ 1 రాత్రికి ఆయన తిరుమల చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. అక్టోబర్‌ 2న తన కుమార్తెలతో, స్నేహితులు ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశ్వీరచనం అందజేశాక తన ప్రాయశ్చిత దీక్షను పవన్‌ విరమించారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని పవన్‌ పరిశీలించారు. దేవుడి భోజనం చేశారు.

కాగా అంతకు ముందు అలిపిరి మార్గంలో పవన్‌ మీడియాతో మాట్లాడారు. తన దీక్ష కేవలం తిరుమల లడ్డూ కోసం కాదన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ లడ్డూలో కొవ్వులు కలవలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. కలిశాయనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని మాత్రమే సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే నెయ్యికి సంబంధించి వచ్చిన ల్యాబు రిపోర్టులో తేడాలు ఉన్న విషయాన్ని మాత్రమే ప్రశ్నించిందన్నారు.

లడ్డూ వ్యవహారంలో విచారణ సాగుతోందని పవన్‌ తెలిపారు. కాబట్టి తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు శాశ్వత విధానం అంటూ ఒకటి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి దారుణంగా ఉందని పవన్‌ తెలిపారు. ఎక్కడేంచేసినా ఎవరూ అడగరనే రీతిలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో పలు ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను విధ్వంసం చేస్తే ఎవరూ పట్టించు కోలేదని వాపోయారు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారని, విజయవాడ దుర్గమ్మ వెండి రథానికి ఉన్న బొమ్మలను కూడా దోచుకున్నారని పవన్‌ గుర్తు చేశారు.

అదేవిధంగా పవిత్రమైన తిరుమలలో అన్యమతస్తుల జోక్యం పెరిగిపోయిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మం, దేవాలయాలను పరరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే తాను 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టానని తెలిపారు.

కాగా శ్రీవారి దర్శనానంతరం పవన్‌ కళ్యాణ్‌ వారాహి డిక్లరేషన్‌ బుక్‌ తో కనిపించారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు దాన్ని ఆసక్తిగా తిలకించారు. కాలినడక సమయంలోనూ వారాహి డిక్లరేషన్‌ బుక్‌ ఆయన వెంట ఉండటం గమనార్హం. దర్శనానికి వెళ్లిన సమయంలోనూ దాన్ని వెంట తీసుకెళ్లారు.