Begin typing your search above and press return to search.

కొండా చేసింది తప్పే.. ఇంత ఫైర్ పవన్ కుమార్తెను అన్నప్పుడేది?

రాజకీయం రాజకీయ అంశాలకు పరిమితం కావాలి. ఆ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్ని డ్యామేజ్ చేసేలా ఉండొద్దు

By:  Tupaki Desk   |   4 Oct 2024 4:31 AM GMT
కొండా చేసింది తప్పే.. ఇంత ఫైర్ పవన్ కుమార్తెను అన్నప్పుడేది?
X

రాజకీయం రాజకీయ అంశాలకు పరిమితం కావాలి. ఆ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్ని డ్యామేజ్ చేసేలా ఉండొద్దు. ఇదెవరు చేసినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే. గాంధీ జయంతి రోజున మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ మరోసారి ప్రస్తావించటం ఏ మాత్రం ఇష్టం లేదు. మంచిని నాలుగుసార్లు ప్రస్తావించొచ్చు. చెడును వీలైనంత తక్కువగా చెప్పుకోవటం అవసరం. అందుకే.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ రాయట్లేదు.

కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని కుటుంబం.. సమంతతో పాటు చిరంజీవి.. మహేశ్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. నాని.. ప్రకాశ్ రాజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. అందరూ ఖండించారు. ఆమె మాటలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహాన్ని స్వాగతించాల్సిందే. ఎవరికి కూడా మరొకరి వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసేలా మాట్లాడే హక్కు ఉండదు. హద్దులు దాటిన వేళ.. వారెంత బలవంతులైనా.. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

కొండా సురేఖపై ఇంతలా విరుచుకుపడిన టాలీవుడ్.. పవన్ కల్యాణ్ తల్లి మీదా.. ఆయన వ్యక్తిగత జీవితం మీదా.. ఆయన కుమార్తె మీదా సినీ పరిశ్రమకు చెందిన వారే మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు. ఎందుకు కంట్రోల్ లో ఉండాలని వార్నింగ్ ఇవ్వలేదు. సాటి నటుడిని ఉద్దేశించి సినిమా రంగానికి చెందిన వారే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నప్పుడు.. ఈ గొంతులన్ని ఏమైపోయాయి? న్యాయం ఎవరికైనా ఒకేలా ఉండాలి కదా? ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ అన్నట్లు ఉండకూడదు కదా?

పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ఇష్టారాజ్యంగా టార్గెట్ చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు.. అందునా జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేసే ప్రకాశ్ రాజ్ సైతం ఎందుకు మౌనంగా ఉన్నట్లు? అంటే.. టాలీవుడ్ లో కొందరిని అన్నప్పుడు మాత్రమే అందరూ స్పందిస్తారా? మిగిలిన సందర్భాల్లో రియాక్టు కారా? అన్నదిప్పుడు మరో ప్రశ్న. కొండా దారుణ వ్యాఖ్యలపై ఎంత సీరియస్ గా స్పందించారో.. అంతే తీవ్రంగా పవన్ ఫ్యామిలీని అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. రాజకీయం ఉంటే రాజకీయం వరకు మాట్లాడుకో. పవన్ తల్లిని.. కుమార్తెను ఎందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు? నోరు పారేసుకుంటే టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తామని.. కేసులు పెడతామని అసోసియేషన్ తరఫున ఎందుకు మాట్లాడలేదు? అన్నదిప్పుడు చర్చగా మారింది.

టాలీవుడ్ స్పందిస్తున్న తీరు పక్షపాతంతో కూడుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ విమర్శపై టాలీవుడ్ కు చెందిన ఎవరు సమాధానం ఇస్తారు? కొన్ని విషయాలకు జస్ట్ ఆస్కింగ్ పేరుతో మాట్లాడే ప్రకాశ్ రాజ్ అయినా ఈ అంశాన్ని టేకప్ చేస్తారా? అన్నది క్వశ్చన్. ఇప్పటికైనా ఒక విషయంలో అతిగా రియాక్టు కావటం.. మరికొన్ని అంశాల్లో అస్సలు పట్టనట్లుగా ఉండే తీరును వదిలేసి నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది మర్చిపోకూడదు.