Begin typing your search above and press return to search.

వైసీపీ హార్డ్ కోర్ ఏరియాలే పవన్ టార్గెట్!

వీటి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అరకు, పాడేరు, సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండలలో జనసేన బలంగా మారడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 2:30 AM GMT
వైసీపీ హార్డ్ కోర్ ఏరియాలే పవన్ టార్గెట్!
X

అధికారంలో ఉన్నపుడే అన్నీ చక్కదిద్దుకోవాలి. రాజకీయ పార్టీలకు అది అంది వచ్చిన అవకాశంగా ఉంటుంది. అనేక మంది పార్టీలో చేరుతారు. ప్రజలకు కూడా అభివృద్ధి కార్యక్రమాల రూపంలో మేలు చేసి చూపించవచ్చును. ఆ విధంగా పార్టీ చేరని ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఇపుడు జనసేన అదే కార్యక్రమంలో ఉంది.

ఉత్తరాంధ్రా జిల్లలలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడుగా ఉన్నాయి. వీటి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అరకు, పాడేరు, సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండలలో జనసేన బలంగా మారడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ ఎస్టీ జిల్లాలలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. గతంలో కాంగ్రెస్ ఆ తరువాత వైసీపీ ఎక్కువగా ఈ స్థానాలను గెలుచుకున్నాయి. 2024లో కూటమికి వచ్చిన ప్రభంజనంలో ఈ స్థానాలలో నాలుగు కూటమికి దక్కాయి. అరకు, పాడేరు మాత్రం ఎప్పటి మాదిరిగానే వైసీపీ పరం అయింది.

దాంతో పవన్ వ్యూహాత్మకంగానే ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు రోజుల అధికారిక పర్యటనలు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఈ సీట్లలో కనుక బలం పెంచుకుంటే జనసేనకు పటిష్టం అయ్యే చాన్స్ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు రానున్న కాలంలో మరిన్ని సీట్లు అధికంగా పొందేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు.

అందుకే కోరి మరీ వైసీపీకి పట్టు ఉన్న చోటనే జనసేన బలాన్ని పెంచుకోవాలని అనుకుంటోంది అంటున్నారు. జనసేనకు గోదావరి జిల్లాలలో బలం ఉంది. ఉత్తరంధ్రాలో మైదాన ప్రాంతాలలో కూడా చెప్పుకోదగిన బలం ఉంది.

అయితే ఏజెన్సీ ప్రాంతంలో కనుక పట్టు సాధిస్తే మొత్తం 34 సీట్లు ఉన్న ఈ రీజియన్ లో పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకునేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ఇక్కడ ప్రారంభించడం ద్వారా గిరిజనానికి చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేశారు.

అంతే కాదు తాను ప్రతీ రెండు నెలలకు ఒకసారి వచ్చి గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిని స్వయంగా పరిశీలిస్తాను అని హామీ ఇచ్చారు. జనసేన 2019లో ఒంటరిగా పోటీ చేసినపుడు కూడా గిరిజన ప్రాంతాలలో బాగానే పెర్ఫార్మ్ చేసింది.

ఈసారి పొత్తులలో భాగంగా పాలకొండ ఎస్టీ రిజర్వుడ్ సీటుని కైవశం చేసుకుంది. ఇపుడు మరింతగా గిరి సీమలలో జనసేన చొచ్చుకుని పోవాలని పవన్ యక్షన్ ప్లాన్ రూపొందించారు. అందుకే ఆయన వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియాల మీదనే ఫోకస్ పెట్టారు

దాని వల్ల కూటమిలో మిత్రుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఏర్పడవని అదే టైం లో జనసేన కూడా బలంగా మారేందుకు ఆస్కారం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గాల మీద కూడా జనసేన చూపు సారించింది అని అంటున్నారు. రానున్న రోజులలో వాటిలో కూడా తరచూ పవన్ పర్యటనలు ఉండేలా చూసుకుంటారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే జనసేనను రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో ఇంకా గట్టిగా నిలబెట్టే ప్రయత్నం అయితే పవన్ మొదలెట్టేశారు అని అంటున్నారు. వైసీపీకే ఓటు వేయడం అన్నది అలవాటు చేసుకున్న గిరిజన ప్రాంతాలు 2024లో విలక్షణమైన తీర్పు ఇచ్చాయి. ఇపుడు కనుక వైసీపీ తగిన రిపేర్లు చేసుకోకపోతే భవిష్యత్తులో జనసేన జెండా ఏగరడం ఖాయమని అంచనా వేస్తున్నారు.