వైసీపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
అయితే.. ఆ వ్యాఖ్యలు విన్న పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ చేశారు. తాను లైవ్‌లో లేకున్నా తన తరఫున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 5 Sep 2024 5:36 AM GMTఅంతకుముందు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవలేని పవన్ కల్యాణ్.. మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాడు. ఆయన పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి రికార్డు క్రియేట్ చేశారు. 21 స్థానాలకు గాను 21 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం అయ్యారు.
కూటమిగా జతకట్టి తిరుగులేని విజయం సాధించిన పవన్.. చివరకు చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనకు కేటాయించిన శాఖలపై రివ్యూలు చేస్తూ.. అధికారులకు, జనసైనికులకు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తన దృష్టికి వచ్చిన తీవ్రత ఉన్న సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. విజయవాడను వరదలు ముంచెత్తాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిరాశ్రయులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ప్రజలు అంతలా ఇబ్బందులు పడుతుంటే పవన్ కల్యాణ్ కనీసం పరామర్శలకు సైతం వెళ్లడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే.. ఆ వ్యాఖ్యలు విన్న పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ చేశారు. తాను లైవ్‌లో లేకున్నా తన తరఫున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. తాను ఫీల్డ్‌లోకి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, తన చుట్టూ భారీగా జనాలు చేరుతారని అందుకే వెళ్లడం లేదని తెలిపారు. ఇది కాస్త సహాయక చర్యలను దెబ్బతీస్తుందని అన్నారు.
దానికి మరింత కన్‌క్లూజన్ ఇస్తూ.. తాను ఎందుకు ఫీల్డ్‌లో లేనో తన వెంట ఎవరైనా వైసీపీ నేత వస్తే చూపిస్తానన్నారు. తన సొంత కాన్వాయిలోనే ఆ నేతలను తీసుకెళ్లి పరిస్థితిని చూపిస్తానని చెప్పారు. తాను బయటకు వెళ్లే సమయంలో చెప్తానని.. తనతోపాటు ఏ వైసీపీ కార్యకర్త అయినా రావొచ్చని.. బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూడొచ్చని హితవు పలికారు. తనను ప్రశ్నిస్తున్న నాయకులకు అప్పుడు అర్థం అవుతుందని సూచించారు.
అయితే.. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు, సోషల్ మీడియా వింగ్ కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, అంత ప్రభావం చూపే శక్తి లేదని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి విజయవాడ నగరం వరదలతో అల్లాడుతుంటే.. పవన్ కల్యాణ్, వైసీపీల మధ్య ఈ మాట యుద్ధం వేడిని రాజేసింది.