ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు ఏమైంది? పార్టీ క్లారిటీ ఇదే!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏమైంది? ఆయన ఎక్కడ ఉన్నారంటూ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 5 Feb 2025 2:50 PM GMTఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏమైంది? ఆయన ఎక్కడ ఉన్నారంటూ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటు అమరావతిలోనూ.. అటు ఢిల్లీలోనూ ఆయన కనిపించలేదు. అమరావతిలో ఉంటే.. ఆయన అధికారులతో సమీక్షలో.. మీడియాతో చిట్‌చాట్‌లో.. పార్టీ నాయకులతో భేటీలో చేసేవారు. అదేవిధంగా ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తీసుకునేవారు.కానీ, గత మూడు నాలుగు రోజులుగా పవన్ కల్యాణ్ కనిపించడం లేదు. ఆయన మాట కూడా వినిపించడం లేదు.
దీంతో సహజంగానే సోషల్ మీడియాలో పవన్ గురించిన చర్చ సాగింది. తాజాగా దీనిపై జనసేన పార్టీ కార్యాలయం వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపింది. వైరల్ జ్వరంతో ఆయన నాలుగు రోజులుగా ఇబ్బంది పడుతున్నారని.. దీనికి సంబంధించి వైద్యం కూడా తీసుకుంటున్నట్టు పేర్కొంది. అయితే.. ఆయన హైదరాబాద్‌లో ఉండి వైద్యం తీసుకుంటున్నారా? లేక ఏపీలోనే ఉన్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపింది. వైరల్ జ్వరంతో పాటు.. స్పాండిలైటిస్‌తోనూ పవన్ బాధపడుతున్నారని పేర్కొంది.
పని ఒత్తిడి కారణంగా తీవ్రంగా అలసటకు గురైనట్టు పార్టీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. అస్వస్థత నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరు కాకపోవచ్చని తెలిపారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం ఆయన హాజరు కావాల్సి ఉందని.. గతంలో వైరల్ జ్వరం ఉన్నప్పటికీ వచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలానే హాజరయ్యే అవకాశం ఉందని అయితే.. ఈ విషయంపై క్లారిటీ రావల్సి ఉందని పేర్కొన్నారు. దీంతో పవన్‌పై వస్తున్న కామెంట్లకు పార్టీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది.