పవన్ హిందూత్వం...కమలానికి అస్తిత్వం!
జనసేన శివసేన ఒక్కటే అని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
By: Tupaki Desk | 20 Nov 2024 3:51 AM GMTజనసేన శివసేన ఒక్కటే అని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో 1960 దశకంలో పుట్టిన శివసేన మరాఠాల హక్కుల సాధన కోసం మొదట్లో చాలా గట్టిగానే పోరాడింది. ఆ మీదట హిందూత్వ భావజాలాన్ని తన సిద్ధాంతంగా మార్చుకుంది.
అలా స్థానిక ఎన్నికల నుంచి ఎదుగుతూ వస్తూ 1990 దశకంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. బీజేపీది అదే సిద్ధాంతం కావడంతో రెండు పార్టీలు కలిసి మహా రాజకీయాలు చేశాయి. జనసేన విషయానికి వస్తే పవన్ పార్టీ పెట్టిన నాటికి హిందూత్వ లేదు, పైగా ఆయన మాటలలో కమ్యూనిజం భావజాలం కనిపించింది. చెగువేరా కూడా గట్టిగా వినిపించేవారు. ఇక 2019 ఎన్నికల వేళ కామ్రేడ్స్ తో పొత్తు మాయావతిని దేశ ప్రధానిగా చూడాలని పవన్ కోరుతున్న తీరు అన్నీ కూడా జనాలకు గుర్తు ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల తరువాత పవన్ సనాతన ధర్మం అంటున్నారు. హిందూత్వ జెండాను ఎత్తుకున్నారు. మహారాష్ట్రలో ఆయన బీజేపీకి చేసి పెట్టిన ప్రచారం చూస్తే ఆయన భావజాలం ఫక్తు బీజేపీదే అని అంటున్న వారూ ఉన్నారు.
పవన్ ప్రవచించే సనాతనధర్మం బీజెపీ ఐడియాలజీలోనూ ఉంది. ఇంతలా పవన్ మాట్లాడుతున్న తీరుని చూసిన వారు ఆయన బీజేపీకి ప్రియమైన మిత్రుడుగా మారిపోయారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన టీడీపీ బీజేపీ ఉన్నాయి. అయితే టీడీపీ లౌకిక వాదం స్టాండ్ ని తీసుకుంది. ఆ పార్టీ మధ్యస్థ వాద విధానాలను అనుసరిస్తోంది.
బీజేపీతో రాజకీయ పొత్తు తప్ప సిద్ధాంతపరంగా కొన్ని కీలకమైన విషయాలలో విభేదిస్తుంది అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఫిలాసఫీయే బెస్ట్ అంటున్నారు. దేశాన్ని కాపాడేది బీజేపీయే అని నినదిస్తున్నారు.
ఇక పవన్ వంటి నాయకుడు ప్రజాకర్షణ కలిగిన నేత తమతో ఉండడం బీజేపీకి ఎంతో రాజకీయ లాభమే అని అంటున్నారు. సనాతన ధర్మం అన్నది పవన్ నోటి వెంట రావడం వల్లనే చర్చకు ఆస్కారం ఇచ్చింది.పవన్ హిందూత్వ నినాదాన్ని గట్టిగా వినిపిస్తే గ్రాస్ రూట్ లెవెల్ లో అది చొచ్చుకుని పోతుంది అని అంటున్నారు. ఆ విధంగా బేజేపీ హిందూత్వ విత్తనాలు క్షేత్ర స్థాయిలో గట్టిగా నాటడానికి పవన్ ఒక ప్రేరణ శక్తిగా ఉంటారని అంటున్నారు. ఇక పవన్ కి లాభమేంటి అంటే బీజేపీ జనసేనలకు ముఖ్యమంత్రి అభ్యర్థి పవనే అని అంటున్నారు.
రేపు జమిలి ఎన్నికలు జరిగినా లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా కూడా కూటమితోనే పొత్తులు ఉంటాయని అంతా అంటున్నారు. ఆ విధంగా బీజేపీకి అత్యంత సన్నిహితుడైన మిత్రుడుగా ఉంటూ పవన్ ఆ పార్టీ మద్దతుతో కచ్చితంగా సీఎం పోస్టుకు బలమైన అభ్యర్ధిగా నిలుస్తారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే పవన్ హిందూత్వ నినాదానికి ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. జమిలి ఎన్నికలు వస్తే కనుక ఏపీలో అది మరింత గట్టిగా వినిపిస్తుంది అని అంటున్నారు. మరి వీర హిందూత్వ రాగాల మధ్య టీడీపీ ఏ విధంగా కూటమిలో సర్దుకుని పోతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ జనసేనలతో టీడీపీకి దోస్తీ అనివార్యం అయిన వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.