Begin typing your search above and press return to search.

హైడ్రాతో జరుగుతున్న తప్పుల్ని భలేగా ఎత్తి చూపిన పవన్ కల్యాణ్?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 4:45 AM GMT
హైడ్రాతో జరుగుతున్న తప్పుల్ని భలేగా ఎత్తి చూపిన పవన్ కల్యాణ్?
X

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. చెరువుల్ని కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపట్టే వారితో పాటు.. చెరువు పరివాహక ప్రాంతాల్లో నిర్మించే అక్రమ నిర్మాణాల మీద హైడ్రా కన్నెర్ర చేయటం.. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్న వైనం తెలిసిందే. ప్రముఖుడైనా.. సామాన్యుడైనా సరే.. ఒకటే న్యాయం అన్నది ఒక ఎత్తు అయితే.. నోటీసుల మాటతో సంబంధం లేకుండా..ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. కూల్చివేతలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న హైడ్రా సంచలన చర్చగా మారింది.

మొన్నటికి మొన్న హైడ్రా మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వ్యవస్థను అభినందించారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి అవసరమన్న అభిప్రాయం రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల బుడమేరు ముంపుతో హైడ్రా లాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లోనూ షురూ చేయాలన్న మాటకు బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూసినప్పుడు.. హైడ్రా అంశంపై ఆయన లోతైన ఆలోచనలు చేయటమే కాదు.. రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుల్ని భలేగా ఎత్తి చూపారని చెప్పాలి.

హైడ్రా కూల్చివేతలపై పెద్దఎత్తున హర్షం కొన్ని వర్గాల నుంచి వస్తున్నప్పటికీ.. బాధితుల విషయంలో మాత్రం కొంత నెగిటివిటీని ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. దీనికి పరిష్కారం ఏమిటన్న చర్చ ప్రభుత్వంలోని కొన్ని వర్గాల్లో మొదలైంది. ఇలాంటి వేళలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. రేవంత్ సర్కారు ఈ అంశంపై తక్షణమే ఫోకస్ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకూ పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘బుడమేరు సంబంధించిన భూమిలో తెలిసో తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమిత స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారు సైతం ఉన్నారు. అయితే.. అక్రమ నిర్మాణాలను కూల్చివేతలకు ముందే.. వారితో మాట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది’’ అని అభిప్రాయపడ్డారు. నిజానికి హైడ్రా కూల్చివేతలు జరిపే వారి విషయాన్ని చూస్తే.. అమ్మినోళ్లు.. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినోళ్లు బాగున్నారు. కేవలం కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే అసలుసిసలు బాధితులు అవుతున్నారు.

పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా.. హైడ్రా కూల్చివేతల విషయంలో.. నష్టపోయే బాధితులకు పరిహారం కోసం.. పునరావాసం అంశంపై ఫోకస్ పెడితే.. వ్యతిరేకత తగ్గి.. సానుకూలత పెరిగే వీలుంది. మొన్నటికి మొన్న హైడ్రాను పొగిడేసిన పవన్ కల్యాణ్.. తాజాగా అందులోని దిద్దుబాట్ల గురించి వ్యాఖ్యానించటం చూస్తే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసింత అలెర్టు కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం చేస్తారో చూడాలి .