భద్రం బ్రదరూ.. అధికారులతో డేంజర్: కూటమి జాగ్రత్త పడాల్సిందే.. !
దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ పర్యటించారు.
By: Tupaki Desk | 23 Oct 2024 12:30 AM GMT''ఏది నిజం? గుర్లలో ఏం జరిగింది?'' ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న విష యం. విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో తాగునీరు కలుషితమై.. అతిసార(డయేరియా) ప్రబలింది. గత వారం రోజులుగా ఇక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందారు. ఈ వ్యవహారం.. నాలుగు రోజుల తర్వాత.. పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ పర్యటించారు.
అయితే.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. దీనికి ముందు ఉన్నతాధికారులు, ముఖ్యం గా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఇచ్చిన నివేదికకు మధ్య పొంతన లేకుండా పోయింది. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. పలు చానెళ్లలోనూ దీనిపై డిబేట్లు జరుగుతున్నాయి. ఇక, ప్రతిపక్షం వైసీపీ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకంగా 16 మంది మృతి చెందారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే స్పందించిన అధికారులు.. లేదు లేదు.. మొత్తంగా నచిపోయింది నలుగురని చెప్పారు. వీరిలో ఒక్కరే అతిసారతో చనిపోయారని చెప్పారు. మిగిలిన ముగ్గురు గుండెపోటు, కిడ్నీ సమస్యలతో చనిపోయారని అన్నారు. ఇక, మంత్రి మండవల్లి రాంప్రసాద్ కూడా ఇదే మాట చెప్పారు. వైసీపీ అనవ సరంగా రాజకీయం చేస్తోందన్నారు. చనిపోయింది ఒక్కరేనని తేల్చి చెప్పారు. దీంతో వాస్తవం ఏంటనేది సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
ఇంతలోనే పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించి.. డయేరియా మృతుల వ్యవహారంపై తీవ్రంగా స్పందించా రు. 10 మంది చనిపోయారని సంఖ్యాపరంగా కూడా వెల్లడించారు. దీంతో ఎంత మంది చనిపోయారన్న దానికి ఒక ప్రాతిపదిక వచ్చింది. డిప్యూటీ సీఎం చెప్పిన తర్వాత దీనిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, అధికారులు ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. వాస్తవాలను వక్రీరించి.. సర్కారుకు తప్పుడు నివేదికలు ఇచ్చిన ఫలితంగానే వైసీపీ ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూటమికి కూడా ఎదురయ్యే ప్రమాదం తాజా ఘటన రుజువు చేస్తోందన్నది విశ్లేషకుల మాట.