సనాతనీ పవన్ ని టార్గెట్ చేసిన జగన్
పవన్ జనసేనాని. పవర్ స్టార్. ఇపుడు ఉప ముఖ్యమంత్రి. దీనితో పాటు ప్రభుత్వంలోకి వచ్చాక అధికారం అందుకున్నాక ఆయన సనాతనీ గా మారారు.
By: Tupaki Desk | 27 March 2025 9:10 AMపవన్ జనసేనాని. పవర్ స్టార్. ఇపుడు ఉప ముఖ్యమంత్రి. దీనితో పాటు ప్రభుత్వంలోకి వచ్చాక అధికారం అందుకున్నాక ఆయన సనాతనీ గా మారారు. హిందూ ధర్మ పరిరక్షణ అని చాలా మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అంతే కాదు వీలు కుదిరినప్పుడల్లా ఆయన సనాతన వాదాన్ని వినిపిస్తున్నారు. ఆలయాలు తిరుగుతూ వస్తున్నారు కాషాయం కడుతూ నిలువు నామాలతో ఆయన ఒక స్వామీజీగా కనిపిస్తూంటారు. అలాగే అసెంబ్లీకి వెళ్తారు, అలాగే ఢిల్లీలో జరిగే కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకుంటారు.
హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఉందా అని ప్రధాని చేత అడిగించుకుని చిరునవ్వులు చిందిస్తారు. అంతలోనే ఆయన తెల్ల బట్టలతో మళ్లీ కనిపిస్తారు. మరి పవన్ కాషాయ ధారణ ఎపుడు చేస్తారు. ఎపుడు మామూలు డ్రెస్ లో కనిపిస్తారు అంటే అది ఆయనకే తెలియాలి అనే అంటారు. మొత్తానికి పవన్ తాను సనాతనీ అని చెప్పుకోవడానికి ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్నది అందరికీ అర్థం అవుతోంది.
తిరుపతి లడ్డూలు కల్తీ అయ్యాయన్న దాని మీద పవన్ ఎంతలా ఆవేదన చెందారో అంతా చూశారు. తిరుపతిలో ఆ మధ్యన జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన తన శాఖ కాకపోయినా క్షమాపణలు చెప్పారు. అటువంటి పవన్ కడప జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఎంతో కాలం బట్టి ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేసినపుడు మాత్రం పెదవి విప్పలేదు.
ఆయన అటవీ శాఖ అధికారులే ఈ ఆశ్రయాన్ని కూల్చివేశారు అని వార్తలు వచ్చినా రియాక్టు కాలేదు. కానీ చిత్రంగా మంత్రి నారా లోకేష్ దీని మీద వేగంగా రియాక్టు అయ్యారు. క్షమాపణలు చెప్పారు. కూల్చివేసిన దానిని మూడు రోజులలో నిర్మించారు.
ఇవన్నీ కొద్ది రోజుల క్రితం జరిగాయి. మళ్ళీ వాటిని వెలికి తీస్తూ పవన్ మీద బాణాలు ఎక్కుపెట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. పవన్ నే ఆయన గుచ్చి గుచ్చి ఈ విషయంలో ప్రశ్నించారు. ఒక ప్రసిద్ధ క్షేత్రం మీద బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేశారని జగన్ మండిపడ్డారు.
ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలమేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతోనే జరిగింది అని జగన్ ఆరోపించారు. హిందూ ధర్మంపైన ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో ఈ విధంగా దాడిచేశారని జగన్ ఫైర్ అయ్యారు.
ఇక తామే ఉత్తర్వులిచ్చ తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, ఇప్పుడు తీయని మాటలు చెప్తున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా అలాగే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా ఇవన్నీ చూస్తే ఆలయాల మీద దాడులు చేస్తోంది ఎవరు అన్నది అందరికీ తెలుసు అని జగన్ అన్నారు.
ఏపీలోని ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే అని జగన్ అన్నారు. వీరే మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే అంటూ పవన్ మీద సెటైర్లు పేల్చారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సినది అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ అని జగన్ నేరుగా ఆయన్ని టార్గెట్ చేశారు.
తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదని నిందించారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా అని ఆయన పవన్ మీద నిప్పులు చెరిగారు. ఇక జగన్ తనకు వచ్చిన అర్జీ విషయంలో కాశీనాయన ఆలయం కూల్చివేత మీద అన్నీ తెలిసి మాట్లాడుతున్నాను అని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023 ఆగస్టు 7న అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలను నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అదే నెల ఆగస్టు 18న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కి ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని కోరినట్లుగా జగన్ చెప్పారు
అంతే కాదు ఆ భూమిని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు అలా తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో కాశీనాయన ఆశ్రమం నిలబడిందని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల వ్యవధిలోనే కూల్చేసారు అని ఆయన మండిపడ్డారు. మొత్తానికి పవన్ మీద జగన్ చేసిన ఆ విమర్శలు శాఖాపరమైనవి. ఇప్పటిదాకా ఆయనను వ్యక్తిగతంగా విమర్శించిన పవన్ ఇపుడు ఆయన శాఖలలో తప్పులను ఎండగడుతూ చేసిన ఈ హాట్ కామెంట్స్ మీద పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.