Begin typing your search above and press return to search.

జల్సా మూవీ డైలాగ్ : పవన్ ఇచ్చిన రిఫరెన్స్ వైరల్ !

ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని కీలకమైన పాత్ర పోషిస్తున్న జనసేన ఏపీ ఖజానా గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తోందా.

By:  Tupaki Desk   |   26 Feb 2025 3:56 AM GMT
జల్సా మూవీ డైలాగ్ : పవన్ ఇచ్చిన రిఫరెన్స్ వైరల్ !
X

ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని కీలకమైన పాత్ర పోషిస్తున్న జనసేన ఏపీ ఖజానా గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తోందా. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం వెనక అర్ధమేంటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఖజానా ఖాళీ అయిందని అదంతా గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం అని ఇప్పటికే చంద్రబాబు పవన్ బయట అనేక సమావేశాలలో చెబుతూ వచ్చారు.

రెండు రోజులలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పవన్ నిండు శాసనసభలో మాట్లాడుతూ ఖజానా పరిస్థితి ఇదీ అని తేటతెల్లం చేశారా అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన తన సినిమాలోనిదే ఒక రిఫరెన్స్ తీసుకున్నారు. పవన్ నటించిన జల్సా మూవీలో ఒక క్యాచీ డైలాగ్ ని ఆయన సభలో ఉటంకిస్తూ చొక్కా బొక్కా అంటూ మాట్లాడారు. జల్సా సినిమాలో హీరో స్నేహితులు ఎవరొచ్చి అడినా వార్డు రోబ్ లో చొక్కా ఉంటుంది అందులో డబ్బులు ఉంటాయి తీస్కో అని చెబుతాడు. తీరా చూస్తే కనుక అసలైన చొక్కా యజమాని అందులో నుంచి వచ్చి చొక్కా వెనక ఏమీ లేదు బొక్క తప్ప అని ట్విస్ట్ ఇస్తాడు అని పవన్ చెప్పారు.

అలా దానిని రిఫరెన్స్ గా తీసుకుని ఆయన ఖజానా ఖాళీ అయింది అని ఫుల్ క్లారిటీ తో చెప్పేశారు అని అంటున్నారు. పవన్ స్వతహాగా సినీ నటుడు క్రియేటర్ కనుక సినీ పరిభాషలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఇదీ అని కళ్ళకు కట్టినట్లుగా చెప్పేశారు అని అంటున్నారు. దీని వల్ల అటు క్లాస్ మాస్ అందరికీ ఒక్కసారిగా ఏపీలో ఆర్థిక పరిస్థితులు అర్ధమవుతాయన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఒక సక్సెస్ ఫుల్ సినిమాలోని డైలాగ్ ని రిఫరెన్స్ గా ఇచ్చారు అని అంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ఏపీ ఖజానాను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది అన్నది పవన్ చెబుతున్న సారాంశంగా చూడాల్సి ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో ఆదాయం తక్కువగానే ఉంది. తొమ్మిది నేలల కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇంకా ఫలితాలు తెచ్చే స్థాయిలో లేవు. దాంతో పాటుగా ఖర్చులు పెరిగాయి. అన్ని వర్గాలలో ఆశలు పెరిగాయి సూపర్ సిక్స్ హామీలతో సహా చాలా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో అందరి చూపూ ఏపీ బడ్జెట్ మీదనే ఉంది. దాంతో పవన్ బడ్జెట్ మీద ఆశలు పెట్టున్న వారికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆయన గతంలో కాకినాడ పోర్టులో షిప్ ని తనిఖీ చేసేందుకు వెళ్ళినపుడు కూడా అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏపీలో ఖజానా ఖాళీ అయింది అని చెప్పారు. ఆయన అనేక సందర్భాలలో ఇలా చెబుతూనే ఉన్నా తాజాగా అసెంబ్లీలో జల్సా సినిమాని కోట్ చేస్తూ చెప్పడంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి చూస్తే ఏపీలో నిధుల సమస్య ఉందని అర్ధమవుతోంది అంటున్నారు. మరి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది ఏ ఏ రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయన్న దాని మీద ఆసక్తి అయితే పెరుగుతోంది.