Begin typing your search above and press return to search.

ఒక్క మీటింగ్... పవన్ ఇమేజ్ డౌన్

పవన్ స్పీచ్ లో ఆవేశం ఉంది కానీ ఎన్నో అనవసర విషయాల కలగాపులగం ప్రస్తావనలు కూడా ఉనాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 5:21 PM IST
ఒక్క మీటింగ్... పవన్ ఇమేజ్ డౌన్
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయ్యాక చాలా అట్టహాసంగా నిర్వహించిన ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిజంగా పార్టీకి దిశా నిర్దేశం చేసాయా. పార్టీలో కొత్త జోష్ ని తెచ్చాయా. లేక వివాదాల మయం చేశాయా. లేక పవన్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అంటే దీని మీద అనేక చర్చలు అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మీటింగ్ పవన్ ఇమేజ్ ని డౌన్ చేసింది అన్నదే మెజారిటీ విశ్లేషణలు చెబుతున్న మాట.

పవన్ స్పీచ్ లో ఆవేశం ఉంది కానీ ఎన్నో అనవసర విషయాల కలగాపులగం ప్రస్తావనలు కూడా ఉనాయని అంటున్నారు. ఇక ఆయన ఈ సమావేశం నుంచి తాను బీజేపీకి గట్టి మద్దతుదారుడిని అని చెప్పదలచుకున్నారా లేక జాతీయ రాజకీయాలలో తన ప్రవేశం ఉంటుందని చాటాలని అనుకున్నారా అంటే ఏమో ఏమైనా అన్న మాటా వినవస్తోంది.

ఇక జనసేన ఆవిర్భావ సభ మీద సోషల్ మీడియా వేదికగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేసిన ఒక వీడియో అయితే ఇపుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన పవన్ 12 ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్క మాటలో ఎలా చెప్పారూ అంటే అంతా పొంతన లేని తనం, నిలకడ నిబద్ధత లేని తనం అని ఘాటుగా విమర్శించారు.

ఒక నాయకుడు నిజాయతీగా తన గురించి తాను చెప్పే విషయాలలో సైతం పవన్ పొంతన లేకుండా మాట్లాడారు అని ఆయన ఆక్షేపించారు. తాను ఎక్కడ పుట్టాను అన్న దాని మీద కూడా ఆయన అనేక ఊళ్ళు చెప్పారని తాను ఎక్కడ చదువుకున్నాను అన్న దాని మీద కూడా అనేక విషయాలు చెప్పారని పవన్ గతంలో మాట్లాడిన వీడియో సాక్షిగా గుర్తు చేశారు.

ఇక పవన్ తనకు కులం లేదని మతం లేదని చెబుతూనే కాపులు తనకు ఓటేయాలని కోరడాన్ని కూడా తప్పుపట్టారు. తాను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పిన ఆయన మైనారిటీలు క్రిస్టియన్ల ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలిచాక సనాతనీగా మారడాన్ని ఆయితే ఆయన ఘాటుగా విమర్శించారు.

అదృష్టవశాత్తు ఏపీలో ప్రజలకు మతోన్మాదం లేదని వారు శాంతి కాముకులు కాబట్టే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ బాగానే ఉంది అని అన్నారు. పవన్ గతంలో చెప్పిన సెక్యూలరిజం, సోషలిజం అన్నవి ఏమయ్యాయని ఆయన నిలదీస్తున్నారు.

అసలు జనసేన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు కమ్యూనిస్టులమని, లెఫ్టిస్టులమని చెబుతూ చేగువేరా అని చెప్పుకుని తిరుగుతూ ఇపుడు చూస్తే ఈ రోజు హిందూత్వాన్ని ఒక రైటిస్టు పార్టీగా అనుసరిస్తున్నారని తప్పుపట్టారు. యువత ప్రజలు జనసేన వెంటపడి తన కాలాన్ని విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దని ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపం కూడా చేశారు.

ఈ రోజున దేశంలో మైనారిటీలు క్రిస్టియన్లు భయపడే వాతావరణం ఉందని అన్నారు. పవన్ లాంటి వారే ఈ రకంగా ఎన్నో యూటర్నులు తీసుకోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎక్కడైనా మెజారిటీల వైపు కాదు, మైనారిటీలకే అండగా ఉంటామని చెబుతారని అన్నారు.

ఇక ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ చెప్పి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతీ కేసు ఏమి చేశారని నిలదీశారు. ఆ శాఖలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, వారిని ఎందుకు వెనక్కి తీసుకుని రాలేకపోతున్నారని ప్రశ్నించారు. వాలంటీర్ల పొట్ట కొట్టమని పది వేల జీతం ఇస్తామని చెప్పి ఇపుడు నయవంచనకు గురి చేశారని నిందించారు.

నా పార్టీని నా వారితో నింపను అని చెప్పిన పవన్ నాగబాబుని ఎలా తీసుకుని వస్తున్నారని ప్రశ్నించారు. కులం లేదని చెప్పి రెండు మంత్రి పదవులు కాపులకు ఇచ్చారని పవన్ మీద విరుచుకునిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం రాగద్వేషాలు లేకుండా పాలిస్తామని చెప్పి కుటుంబానికి కాపుల కోసమే జనసేన పనిచేస్తోందని ఆయన తప్పుపట్టారు.

సూపర్ సిక్స్ హామీలు నేరవేర్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఏ హామీలు ఇచ్చారో వాటి నుంచి తప్పించుకోలేరని ఆయన మండించారు. డీలిమిటేషన్ తెస్తున్నా పవన్ నోరు విప్పలేదని అన్నారు. పవన్ బీజేపీ ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే ఒక్క మీటింగ్ తో పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ ప్రసంగాన్ని తప్పుపడుతున్నారు. చేగువేరా గురించి మాట్లాడే హక్కు పవన్ కి లేదని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ అయిన బీవీ రాఘవులు ఘాటుగా రియాక్టు అయ్యారు. పవన్ పార్టీ దశ దిశా లేకుండా సాగుతోందని కూడా ఈ మీటింగ్ మీద అనేక మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ సభ వల్ల పొలిటికల్ మైలేజ్ ఏమైనా వచ్చిందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.