Begin typing your search above and press return to search.

మోడీ టీం లో పవన్...మహా సమరంలోకి రెడీ ?

ఆయన శ్రీవారి లడ్డూ కల్తీ అయింది అన్న దాని మీద ఏకంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 1:30 AM GMT
మోడీ టీం లో పవన్...మహా సమరంలోకి రెడీ ?
X

జనసేన అధినేత తెలుగుదేశం కూటమిలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షాల టీం లో ఉన్నారా అంటే జరుగుతున్న ప్రచారం మాత్రం అవును అనే అంటోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో బీజేపీకి ఇష్టమైన సనాతన ధర్మాన్ని పఠిస్తున్నారు.

ఆయన శ్రీవారి లడ్డూ కల్తీ అయింది అన్న దాని మీద ఏకంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అంతే కాదు ఈ దేశానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు అవసరం అన్నారు. ఆయన ఈ మేరకు వారాహి డిక్లరేషన్ చేశారు.

హిందూత్వకు ప్రాణం ఇచ్చే బీజేపీకి అనుగుణంగా పవన్ కూడా మాట్లాడుతున్నారని వామపక్షాలు ఇతర సంఘాలు విమర్శలు కూడా చేశాయి. అయితే అవతల వైపు చూస్తే బీజేపీకి పవన్ మీద మరింత గురి కుదిరింది అని అంటున్నారు. బీజేపీకి ఎన్డీయేలో ఎందరో మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఫిలాసఫీకి మద్దతుగా నిలిచే పార్టీలు అయితే లేవు. గతంలో శివసేన ఉండేది. కానీ ఆ పార్టీ గత అయిదేళ్లుగా బీజేపీకి ఎదురు నిలిచి ఇండియా కూటమిలో ఉంటోంది.

ఇపుడు శివసేన ప్లేస్ ని జనసేన భర్తీ చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం అని అంటున్నారు. ఈసారి కనుక గెలవకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి. దాంతో సర్వ శక్తులను అక్కడ ఒడ్డుతున్న బీజేపీ తన వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ప్రయోగిస్తోనిద్.

నవంబర్ 20న జరిగే ఈ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు. దాంతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టడానికి బీజేపీ మోడీ టీం ని తయారు చేశారు అని అంటున్నారు. అందులో ఉద్ధండులు అయిన బీజేపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కీలక నేతలు ఎంతో మంది ఉన్నారు. ఇక ఎన్డీయే మిత్రుల విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ ని కూడా తమ టీం లోకి తీసుకున్నారు అని అంటున్నారు

పవన్ కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు ఆయన సనాతనవాదిగా మారిన తరువాత అగ్రెస్సివ్ మోడ్ లో ఇస్తున్న స్పీచులతో ఈసారి ఉత్తరాది ఊగిపోతుందని కూడా లెక్క వేస్తున్నారు. దాంతో పవన్ ని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి దింపుతారు అని అంటున్నరరు.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద వ్యాఖ్యలతో ఆయన ఒక్కసారిగా నేషనల్ ఫిగర్ గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలో కూడా జాతీయ స్థాయిలో బిగ్ డిబేట్లు సాగాయి.

దాంతో పవన్ కి ఉత్తరాదిన ఆదరణ వేరే లెవెల్ లో ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. పవన్ మరి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారా బీజేపీ కూటమి తరఫున ఆయన విసృతంగా ప్రచారం చేస్తారా అన్నది అయితే చర్చగా ఉంది.

పవన్ కనుక మహా ఎన్నికల సమరంలోకి దూకితే అది జనసేనకు బీజేపీకి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుందని అంటున్నారు. రానున్న రోజులలో ఏపీతో పాటు దేశంలో జరిగే అనేక రాజకీయ మార్పులకు కూడా దారి తీస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కి బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద పీట వేస్తోందని ఆయనను అత్యంత నమ్మకమైన మిత్రుడిగా చూస్తోందని అంటున్నారు. పవన్ విషయం తీసుకుంటే ఆయనకు మోడీ పట్ల ఎంతో అభిమానం ఉంది అన్నది తెలిసిందే. సో రానున్న రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో అంతా వేచి చూడాల్సిందే.