జనసేన సభ అనంతరం జూ.ఎన్టీఆర్ పాత వీడియో వైరల్... ఎందుకు?
పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో "జయకేతనం" పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 1:02 PM ISTపిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో "జయకేతనం" పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో అశేషంగా తరలివచ్చిన జనసైనికులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు, వ్యుహకర్తలు నేతలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హిందీ భాష, తమిళనాడు పై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో మోగిపోతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ సందర్భంగా... పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే.. అది వారి ఖర్మ అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమైందని చెప్పారు. దీంతో... వర్మ ఫ్యాన్స్ హర్టవుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి ఎన్నికల ముందు పొత్తులో భాగంగా... పిఠాపురం స్థానాన్ని పవన్ కోసం వర్మ త్యాగం చేశారనేది నిర్వివాదాంశమనే చెప్పాలి! ఆ సమయంలో... కూటమి అధికారంలోకి రాగానే తొలి జాబితాలోనే శాసనమండలికి పంపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవకాశం ఉంటే అంతకంటే ఎక్కువే చేయాలని ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
దీంతో... కూటమి అధికారంలోకి రాగానే వర్మను ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసినా ఆశ్చర్యం లేదనే చర్చ స్థానికంగా బలంగా వినిపించింది! కట్ చేస్తే... ఎన్నికల ఫలితాలు వెలువడటం, కూటమి అధికారంలోకి రావడం, తాజాగా ఎమ్మెలే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం.. అందులో వర్మకు అవకాశం దక్కకపోవడం జరిగిపోయాయి!
పైగా... వర్మకు దక్కాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు ఎగరేసుకుపోయారనే చర్చా స్థానికంగా జరుగుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి "ఖర్మ" అని నాగబాబు చేసిన (ప్రాస) వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి! ఇవి “వర్మ”ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం జరుగుతోంది.
మరోపక్క... ఎన్నికల ప్రచార సమయంలో తన గెలుపు బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నానంటూ వర్మ చేతులు పట్టుకుని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... సరిగ్గా ఈ సమయంలో... జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వీడియో ఉన్నపలంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
అవును... జనసేన ఆవిర్భావ సభ "జయకేతనం" అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అటు జూనియర్ కు, ఇటు టీడీపీ కి మ్యూచువల్ గా ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారని తెలుస్తోంది.
"మన చెవుల్లో బాకాలూదే కల్తీ నాయకులు మనకు వద్దు.. మనకు కావాల్సింది నికార్సైన, నిజమైన, నిజాయతీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పార్టీకి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కాపాడుకోవడానికి మేమున్నామని ముందుకొచ్చే తెలుగుదేశం పార్టీ యోధులు" అంటూ ఆ వీడియోలో జూనియర్ ప్రసంగించారు.
జనసేన సభ అనంతరం ఈ వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది తెలియాల్సి ఉంది! కాకపోతే... అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు టీడీపీకి సంబంధించిన మ్యూచువల్ అభిమానులే ఈ పని చేస్తున్నారని మాత్రం అంటున్నారు!