Begin typing your search above and press return to search.

ఏపీలో మరో యోగి ...హిందూత్వ పండేనా ?

యూపీలో ఒక యోగి ఉన్నారు. ఆయన పేరు అనూహ్యంగా 2017లో యూపీ సీఎం గా ప్రతిపాదిస్తే అంతా ఆశ్చర్యంగా చూశారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 3:17 AM GMT
ఏపీలో మరో యోగి ...హిందూత్వ పండేనా ?
X

యూపీలో ఒక యోగి ఉన్నారు. ఆయన పేరు అనూహ్యంగా 2017లో యూపీ సీఎం గా ప్రతిపాదిస్తే అంతా ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఎవరు అని వాకబు చేసే వారు ఉన్నారు. ఆయన అప్పటికి బీజేపీ ఎంపీగా పలు మార్లు గెలిచి ఉన్నారు. ఫక్తు హిందుత్వ వాది అయిన యోగిని పంపిస్తే కమల వికాసం అతి పెద్ద రాష్ట్రంలో సజావుగా సాగుతుందని భావించిన బీజేపీ తన ప్లాన్ ని అలా అమలు చేసింది.

దాంతో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఆయనే తిరిగి 2022లో బీజేపీని గెలిపించారు. అలా వరసగా రెండు సార్లు యూపీలో పార్టీని గెలిపించి అప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన మ్యాజిక్ ని రిపీట్ చేశారు. ఈ రోజు యోగి ప్రభ ఎలా ఉంది అంటే రేపటి దేశానికి ఆయన కాబోయే ప్రధానిగా ఫోకస్ అవుతున్నారు

అయితే యోగి వీర హిందూత్వకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాలేదు. బీజేపీకి యూపీలో వచ్చిన ఓట్ల విషయంలో తేడా లేదు కానీ ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బ కొట్టింది. అయితే బీజేపీ తన వంతు రిపేర్లు చేసుకుంటోంది. అయినా యూపీకి యోగీ కంటే వేరే బలమైన నేత లేరని ఈ రోజుకీ ఆ పార్టీ భావిస్తోంది.

ఇక సౌతిండియాలో చూస్తే మరో యోగి బీజేపీకి మిత్రుడుగా దొరికారా అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాదిన ఉన్నంతగా హిందూత్వ వేడి వాడి సౌత్ లో ఉండదు. కానీ ఇపుడు ఆ దిశగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచ దేవుడు అయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎనలేని అపచారం జరిగింది అని భావిస్తూ జనసేన అధినేత ఏపీ ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

అంతే కాదు ఆయన దేవాలయాలకు వెళ్ళి ప్రక్షాణల కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి బీజేపీ వారి కంటే పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలతో దీక్షా దక్షునిగా జనంలోకి వస్తున్నారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులు అంతా ఏకీకృతం అయి ఉద్యమించాలని పవన్ పిలుపు ఇస్తున్నారు.

సనాతన ధర్మపరిరక్షణ విషయంలో తాను చనిపోయినా పరవాలేదు అని కూడా పవన్ అంటున్నారు. పవన్ లో ఇలా వీర హిందూత్వను చూస్తున్న బీజేపీ తమ కంటే పది ఆకులు ఎక్కువ చదివారనే భావిస్తున్నారు. బీజేపీకి సౌత్ లో ఎక్కడ ఈ స్థాయిలో గ్లామర్ కలిగిన నేత లేరు. పవన్ కి ఉన్న చరిష్మా ఆయనకు ఉన్న దూకుడుని హిందూత్వతో మిక్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోనే రాజకీయ పంట పండించవచ్చు అని కొత్త ఆశలు కలుగుతున్నాయని అంటున్నారు.

బీజేపీ ఎప్పటికి అయినా ఏపీలో అధికారం చేపట్టాలని చూస్తోంది. అది తమ ఒక్కరి వల్ల కాదని కూడా ఆ పార్టీకి తెలుసు. పవన్ వంటి మిత్రుడిని తమ పక్కన ఉంచుకున్నది కూడా అందుకే. బీజేపీ జనసేన ఎప్పటికి అయినా ఒక్కటిగా ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

ఏపీలో బలమైన రాజకీయ భూమిక పోషించడానికి బీజేపీ జనసేన కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇపుడు పవన్ హిందూత్వ నినాదం కూడా రేపటి రోజున ఇద్దరు మిత్రులకు పనికి వచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. అలా పవన్ రూపంలో దక్షిణాదిన మరో యోగి దొరికారు అని కమలం పార్టీతో పాటు ఆరెస్సెస్ కూడా సంతోషించే సందర్భం ఇదే అని అంటున్నారు.

మరో వైపు జనసేనకు పవన్ కి ముఖ్యమంత్రి పీఠం మీద ఆశలు ఉండనే ఉన్నాయి. అయితే అది ఈ రోజుకు సాకారం కాకపోయినా ఫ్యూచర్ కి బాటలు వేసుకునేందుకు కూడా ఆ పార్టీ తనదైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. దాని కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికారంలో ఉన్నా వీధులలోకి వచ్చి విపక్ష పాత్ర పోషించడం ద్వారా పవన్ కొత్త రాజకీయ పోకడలను పోతున్నారు.

మరి ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకా చెప్పాలీ అంటే సౌత్ లో కానీ హిందూత్వకు ఉన్న మద్దతు ఎంత ఆదరణ ఎంత అనేది కూడా చూడాల్సి ఉంది. దక్షిణాదిన మొదటి నుంచి వైవిధ్యభరితమైన రాజకీయం సాగుతుంది. ఇక్కడ భక్తులు ఉంటారు కానీ సెంటిమెంట్లు మరీ పీక్స్ లో ఉండవు.

అలాగే ఎంతటి వారు అయినా తమ పరిధిని ఎరిగి ఆలోచనలు చేస్తారు. అందుకే బీజేపీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు అయితే సౌత్ ఇండియాలో పండడం లేదు. మరి పవన్ కళ్యాణ్ అంటే సౌత్ ఇండియా లెవెల్ లో అందరినీ ఆకర్షించగల నాయకుడు. ఆయనలో మరో యోగిని బీజేపీ చూస్తే కనుక రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.