జనసేన ప్లీనరీ...టెన్షన్ పెంచేస్తారా ?
ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి తమ నుంచి ఒకరు అందుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. దానిని పవన్ ద్వారా సాకారం చేసుకోవాలని చూస్తోంది.
By: Tupaki Desk | 27 Jan 2025 6:30 PM GMTపవన్ కళ్యాణ్ జనసేన క్యాడర్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. పేరుకు వారికి రాసినట్లుగా ఉన్నా అందులో మొత్తం కూటమి పార్టీల నేతలకు కూడా దిశానిర్దేశం చేసినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం ఔన్నత్యాన్ని అంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరడం అంటే అది అందరికీ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాను పదవుల కోసం రాజకీయాలు చేయడం లేదని పవన్ స్పష్టం చేశారు. ఇది కూటమికి అతి పెద్ద రిలీఫ్ గా చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దానితో పాటే మరో మాట అన్నారు. జనసైనికులు ఏ విషయం బాహాటంగా కానీ సోషల్ మీడియాలో కానీ చర్చించ వద్దు అని కోరారు
పార్టీ అభివృద్ధికి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు అన్నీ జనసేన ప్లీనరీలో పూర్తిగా సమగ్రంగా చర్చిద్దామని పవన్ అన్నారు. దాంతో ఇపుడు ప్లీనరీ మీద పవన్ ఒక్కసారి ఆసక్తి పెంచేశారా అన్న చర్చ సాగుతోంది. ప్లీనరీని ఈసారి జనసేన అధికారంలో ఉంటూ తొలిసారి నిర్వహిస్తోంది. దాంతో ఎన్నడూ లేని విధంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తోంది. దీంతో పాటుగా పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఈ ప్లీనరీ జరుపుతున్నారు. దాంతో రాజకీయంగా పూర్తిగా ఫోకస్ ఈ ప్లీనరీ మీద ఉంటుంది అనడంలో సందేహం లేదు.
మరో వైపు చూస్తే మూడు రోజుల ప్లీనరీలో అనేకమైన అంశాలు చర్చకు వస్తాయని అంటున్నారు. అంతే కాదు జనసేన భవిష్యత్తులో అనుసరించే విధానాలు రాజకీయ కార్యాచరణ కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. దానికి మద్దతుగా పవన్ ఇపుడు సమగ్రమైన చర్చ అంటూ చేసిన ప్రకటనతో రాజకీయ వర్గాలు పూర్తి ఆసక్తిని చూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తనకు పదవుల మీద పెద్దగా ఆశలు లేవని చెప్పినా క్యాడర్ కి ఉంటుంది. అంతే కాదు ఆయనను నమ్ముకున్న అనుచరులకు ఉంటుంది. వీరితో పాటుగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి ఉంటుంది.
ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి తమ నుంచి ఒకరు అందుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. దానిని పవన్ ద్వారా సాకారం చేసుకోవాలని చూస్తోంది. మరి పవన్ ముందు ఇవన్నీ ఉన్నాయి. దాంతో పవన్ క్యాడర్ విషయంలో దిశా నిర్దేశం చేసి కొంతవరకూ వారికి నచ్చచెప్పినా రానున్న కాలంలో అలా ఉంటుందా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక పాతికేళ్ళ పాటు సుదీర్ఘమైన రాజకీయం చేస్తామని పదే పదే పవన్ అంటున్నారు. దాంతో పవన్ జనసేన అన్నది కచ్చితంగా ఏపీలో కీలకమైన పార్టీగా ఉంటూ పాలిటిక్స్ ని శాసిస్తుంది అని చెప్పాల్సి ఉంది. అయితే ఈ అయిదేళ్ళ కాలానికి మాత్రం కూటమిని ఏ మాత్రం డిస్టర్బ్ చేసే యోచన అయితే పవన్ కి లేదని ఆయన ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ప్లీనరీలో ఏమి తీసుకుంటారు ఏ విధంగా ముందుకు సాగుతారు అన్నది మాత్రం అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఏది ఏమైనా రాజకీయ పార్టీలని ఎవరూ సన్యాసి మఠం గా నడపరు అన్నది వాస్తవం. అందువల్ల జనసేన అయినా అధికారంలోకి రావాలని అంతా కోరుకుంటారు. మరి ఏదో నాటికి కూటమిలో పార్టీల మధ్య పోటీ అన్నది అనివార్యం. ఇపుడు అయితే ఏపీలో రాజకీయ ముఖచిత్రం వైసీపీతో పాటుగా కలసి ఉంది. దాంతో ముందు ప్రత్యర్థిగా వైసీపీని అన్ని పార్టీలు టార్గెట్ చేశాయి. ఆ తరువాతనే జనసేన ఫ్యూచర్ యాక్షన్ ఉండవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ప్లీనరీలో ఏమి డిసైడ్ చేస్తారో.