Begin typing your search above and press return to search.

పవన్ ని షిప్ లోకి వెళ్ళకుండా ఆపిన బడా శక్తి ?

పవన్ కళ్యాణ్ ఆషామాషీ నేత కాదు, ఆయన కేంద్రంలోనూ ఏపీలోనూ అత్యంత పలుకుబడి కలిగిన మిత్ర పక్షం.

By:  Tupaki Desk   |   1 Dec 2024 3:50 AM GMT
పవన్ ని షిప్ లోకి వెళ్ళకుండా ఆపిన బడా శక్తి ?
X

పవన్ కళ్యాణ్ ఆషామాషీ నేత కాదు, ఆయన కేంద్రంలోనూ ఏపీలోనూ అత్యంత పలుకుబడి కలిగిన మిత్ర పక్షం. గట్టిగా చెప్పాలీ అంటే పవన్ కనుక పూనుకోకపోతే ఏపీలో కూటమి ఏర్పాటు అయ్యేది కాదు, తద్వారా కేంద్రంలో మూడవసారి ఎన్డీయే సర్కార్ ఏర్పడేందుకు బలం సమకూరేదీ కాదని అంటారు.

అలా పవన్ ఈసారి రెండు ప్రభుత్వాలకు ప్రాణం పోసిన బలమైన నేతగా విశ్లేషించుకోవాలి. అలా కనుక చూస్తే పాలిటిక్స్ లో అసలైన పవర్ స్టార్ గా కూడా పవన్ ని అభివర్ణించాలి. ఆయన కోరుకోవాలే కానీ ఏపీలోనూ దేశంలోనూ జరగనిది ఈ రోజున ఏదీ ఉండదు.

అలాంటి పవన్ కాకినాడకు వచ్చి అక్రమంగా బియ్యం రవాణా అవుతున్న షిప్ లోకి వెళ్లాలీ అంటే వద్దు అని ఆపిన ఆ బడా శక్తి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది. అంతే కాదు పవన్ లో రాజకీయ నేత పాళ్ళు కంటే సగటు మనిషి పాళ్ళే ఎక్కువ. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.

తాను షిప్ లోకి వెళ్ళి చెక్ చేస్తానూ అంటే వద్దు అని ఆపేశారు అని ఆయనే ఓపెన్ గా చెప్పారు. అంతే కాదు తనను కాకినాడ పోర్టుకు రానీయకుండా గత ఆరు నెలలుగా అడ్డుకుంటున్నారు అని కూడా చెప్పారు. పది వేల మంది జీవితాలు పోతాయని కూడా కొందరు చెబుతూ ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పారు.

ఇలా పవన్ ఒక్కోటీ చెప్పేశాక అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే పవన్ ఏమీ ప్రతిపక్షంలో లేరు. ఆయన అపరిమితమైన అధికారాలు కలిగిన ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నారు. అటువంటి ఆయననే అడ్డుకుంటే ఇక సామాన్యుడి గతి సంగతి ఏమిటి అన్నది కూడా అతి పెద్ద చర్చగా మారింది. పవన్ సైతం ఇదే మాట అన్నారు.

తనలాంటి వారినే అడ్డుకుంటే ఇక సాదర జనాలు ఎలా వీటిని ఫేస్ చేస్తారు అని. సో ఇపుడు ఇదే పాయింట్ వైసీపీకి ఆయుధంగా మారుతోంది. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కన్నబాబు ఈ పాయింట్ నే ఎత్తి చూపారు.

పవన్ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, ఏది అయినా తనిఖీ చేయవచ్చు. అటువంటి పవన్ నే అడ్డుకున్నారు అంటే ఆశ్చర్యమే కదా అన్నారు. పైగా పవన్ లాంటి ఉప ముఖ్యమంత్రిని అడ్డుకోవాలీ అంటే అంతకు మించిన స్థాయి వారికే సాధ్యం కదా అంటూ మరో డౌట్ వ్యక్తం చేశారు.

అందువల్ల పవన్ ని అడ్డుకున్న ఆ బడా శక్తి ఎవరూ అని కన్నబాబు ఒక పెద్ద డౌటాను మానం మీడియా సాక్షిగా బయటపెట్టేశారు. పవన్ ని కాకినాడ పోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడం షిప్ ని తనిఖీ చేయకుండా నిరోధించడం అన్నీ చూస్తూంటే ఆయనేమీ ప్రతిపక్షంలో లేరు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయని అన్నారు.

టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో ఒక కీలకమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని అడ్డుకుంటున్నారు అంటే ఏదో జరుగుతోందని జనాలు అనుకునే ప్రమాదం ఉందని కన్నబాబు అంటున్నారు.

అసలు పవన్ వస్తాను అంటే రాకుండా చూసిన వారు ఎవరు, తీరా వస్తే షిప్ లోకి వెళ్లనీయకుండా చేసినది ఎవరు అంటూ కన్నబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చితంగా పవన్ కంటే పై స్థాయిలో ఉన్న వారే ఆయనను షిప్ లోకి వెళ్లకుండా ఆపారని కన్నబాబు అన్నారు. వారు అలా చేయడం తప్పు అని కూడా అన్నారు.

అవినీతి అక్రమాలను నిరోధించే లక్ష్యంతో వెళ్తున్న ఒక ఉప ముఖ్యమంత్రిని అడ్డుకోవడం ఎవరికైనా తగదని కన్నబాబు అన్నారు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలే వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయని అనుకోవాలి. మరో వైపు చూస్తే కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలిపోతున్నదని దీని వెనక కూటమి నేతలే ఉన్నారని ఆధారాలతో సహా నిరూపించగలనని మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కాకినాడ పోర్టు వద్ద చేసింది పూర్తిగా సినిమాటిక్ గా ఉందని ఆయన సెటైర్లు వేశారు.