పవన్ కల్యాణ్ 'మూడో కోరిక'.. బాబు తీరుస్తారా ..!
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సర్కారులో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలి సిందే.
By: Tupaki Desk | 2 Nov 2024 9:30 AM GMTజనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సర్కారులో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలి సిందే. పాలన పరంగా ఆయన దూకుడుగా ఉన్నారు. తనకు కేటాయించిన మంత్రి త్వ శాఖల విషయం లో రాజీ లేని ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఇదేసమయంలో కొన్ని మేలైన సూచనలు చేస్తున్నారు కూడా!. తద్వారా.. తన మనసులోని భావాలను అమలు చేయించడంతోపాటు.. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేలా ఆయన అడుగులు వేస్తున్నారు.
దీనికి సీఎం చంద్రబాబు కూడా మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు రెండు కీలక విషయాల్లో పవన్ కల్యాణ్ చేసిన ఆలోచన, సూచనలు సర్కారుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1) బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమం పేరును మార్చడం. గతంలో వైసీపీ హయాంలో జగనన్న గోరుముద్ద పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. కూటమి సర్కారు వచ్చాక.. దీనికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. వాస్తవానికి అన్న క్యాంటీన్లకే ఈ పేరు అనుకున్నా.. తర్వాత మారింది.
దీంతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు స్థిరపడిపోయింది. రేపు ఎన్ని ప్రభుత్వాలు మారి నా.. దీనికి వంక పెట్టే అవకాశం లేకుండా పోయింది. పైగా మార్చడానికి కూడా వీల్లేదు. సాహిత్యాభిలాషుల నుంచి, మేధావుల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇక, పవన్ కల్యాణ్ చేసిన రెండో సూచన మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, త్రివర్ణ పతాక రూపశిల్పిగా పేరున్న పింగళి వెంకయ్య పేరును ప్రతిపాదించారు.
ఇది కూడా చంద్రబాబుకు నచ్చింది. జనాలు కూడా మెచ్చారు. ఇక, ఇప్పుడు మూడో కోరికగా.. పవన్ కల్యాణ్ మరో ప్రతిపాదనను సర్కారు ముందుంచారు. ప్రపంచానికి అనేక విధాల వైద్య సేవలు అందించిన తెలుగువారు, డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని చంద్రబాబుకు ప్రతిపాదించారు. అంతేకాదు.. యల్లాప్రగడ విశేషాలను కూడా చంద్రబాబుకు అందజేశారు. దీనికి చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇదే జరిగితే.. తెలుగు నాట నేటి తరానికి యల్లాప్రగడ గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంది.