Begin typing your search above and press return to search.

పవన్‌ కూడా వరద బాధితుడే.. ఎలాగంటే!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ఓవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు భారీ వరదలు బెంబేలెత్తిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Sep 2024 9:37 AM GMT
పవన్‌ కూడా వరద బాధితుడే.. ఎలాగంటే!
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ఓవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు భారీ వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాలతో నదులు, వాగులు, వంకలు, జలపాతాలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు పది రోజుల నుంచి ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

కాగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా వరద బాధితుడిగా మారారు. ఆయన ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలుపొందాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుని ఉంటానని ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం వై జంక్షన్‌ సమీపంలో మూడున్నర ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇది 216 నేషనల్‌ హైవే పక్కన ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు ఏలేరు కాలువకు భారీగా ప్రవాహం వచ్చింది. దీంతో పిఠాపురం నియోజకవర్గం కూడా వరద ముంపులో చిక్కుకుంది. పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. మోకాలి లోతు నీటిలో, బురదలోనే ఆయన నడుచుకుంటూ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన ఇల్లు, పొలాలవారికి న్యాయం చేస్తామన్నారు.

కాగా పిఠాపురంలో పవన్‌ ఇంటి స్థలం కూడా వరదలో చిక్కుకుంది. పక్కనే ఉన్న ఏలేరు కాలువ పొంగడంతో ఆ వరద నీరు ముంచెత్తింది. పవన్‌ స్థలంలోకి చేరి తటాకాన్ని తలపిస్తోంది. పవన్‌ నివాస స్థలమే కాకుండా దాని సమీపంలోని నివాసాలు, స్థలాలు, పొలాలు కూడా నీట మునిగాయి. వరద బాధితులను పరామర్శిస్తున్న పవన్‌ కల్యాణ్‌ సైతం వరద బాధితుడిగా మారారు.

కాగా, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు ముందుగానే పిఠాపురంలో 216 నేషనల్‌ హైవే పక్కన 3.52 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అందులోనే పార్టీ కార్యాలయం, నివాసం నిర్మించనున్నారు. ఇప్పుడది వరదలకు మునిగింది.

కాగా వరద బాధితులను ఆదుకోవడానికి పవన్‌ కళ్యాణ్‌ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే, రూ.ఆరు కోట్ల భారీ విరాళాన్ని ఆయన అందజేశారు. ఇందులో కోటి రూపాయల చొప్పున ఏపీ, తెలంగాణకు ప్రకటించారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలకు కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. అలాగే ఏపీలో నీట మునిగిన గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున రూ.4 కోట్లు అందించారు.