Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ జోక్ వేసారా ?

ఇక పవన్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇపుడు చాలా మందిని విస్మయం కలిగించేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   31 Dec 2024 11:39 AM GMT
పవన్ కళ్యాణ్ జోక్ వేసారా ?
X

పవన్ కళ్యాణ్ అంటే సీరియస్ గానే మాట్లాడుతారు అని పేరు. ఆయన ఎక్కడా జోక్స్ వేసేది ఉండదు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన సబ్జెక్ట్ ఓరియెంటెండ్ గానే ముందుకు సాగుతారు అని చెబుతారు. అయితే పవన్ తనకు తెలిసిన విషయాలను తాను మనసులో అనుకుంటున్న విషయాలను ఏదీ దాచుకోకుండా చెప్పేస్తారు అని అంటారు

ఆ విషయంలో ఆయన పర్యవసానాలు ఫలితాలు గురించి కూడా పెద్దగా ఆలోచించరని అంటారు. ఇక పవన్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇపుడు చాలా మందిని విస్మయం కలిగించేలా ఉన్నాయి. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దాంతో పాటుగా ఆయన పదేళ్ళుగా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇక రాజకీయాల్లో ఆయనకు ఎంతో కొంత అనుభవం ఉంది. రాజకీయాలు అంటే కులం మతం వంటివి ఎంత కాదన్నా ఉంటూనే ఉన్నాయి. దీంతో పాటుగా పవన్ గతంలో వైసీపీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. రెండు కులాలే ఏపీని ఏలాలా అని ఆయన అన్నారు అంటే ఆయనకు కులాల మీద అవగాహన ఉంటుందనే అనుకుంటారు.

అందరి గురించి తెలియకపోయినా తన పార్టీలో ప్రముఖుల గురించి మంత్రి పదవులు అందుకున్న వారి గురించి అయినా ఆయనకు కచ్చితనగా తెలిసే ఉండాలని కూడా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం తన పార్టీలో కానీ తనతో పాటు మంత్రులుగా పనిచేస్తున్న వారి విషయంలో కానీ పెద్దగా ఏమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడారు.

తాను పనిని చూస్తాను తప్ప కులాన్ని కాదు అని చెప్పుకొచ్చారు. అయితే బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకుని వెళ్లాలి అని నినదించిన పవన్ కి ఈ కులాల గురించి తెలియదు అని ఎవరూ అనుకోలేరనే అంటున్నారు. అందుకే ఆయన లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆయన ఏమి అన్నారు అంటే తన సహచర మంత్రి, జనసేన నాయకుడుగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కందుల దుర్గేష్ కులం ఏమిటో తెలియదు అని. మరి కులం ఏమిటో తెలియకుండానే ఆయనకు టికెట్లు రెండు సార్లు ఇచ్చారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎందుకు అంటే కులం ప్రాముఖ్యత చాలా ఈ రోజున రాజకీయాల్లో ఉంది. దానికి జనసేన కూడా అతీతం కాదని అందరి అభిప్రాయంగా ఉంది.

నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కవర్ చేసే ప్రయత్నంలోనే పవన్ ఈ విధంగా మాట్లాడారా అన్న చర్చ కూడా వస్తోంది. మంత్రివర్గంలో స్థానం నా సోదరుడు అని ఇవ్వడం లేదని పవన్ అంటున్నారు. ఆయన మంచి పనిమంతుడని తనతో పాటుగా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశారని పవన్ చెప్పుకొచ్చారు.

అంతే కాదు నాగబాబు స్థానంలో వేరే వ్యక్తి ఉండి అంత పనిమంతుడుగా ఉంటే ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చేవాడిని అని కూడా అన్నారు. అలా అంటూనే మరో మంత్రి కందుల దుర్గేష్ కులం ఏమిటో తనకు ఇప్పటిదాకా తెలియదు అన్నారు. అంటే కందుల దుర్గేష్ కులం తెలియదు కానీ నాదెండ్ల మనోహర్ కులం తెలుసా అన్న చర్చ కూడా వస్తోంది.

ఎందుకంటే ఆయన కూడా మంత్రిగా ఉన్నారు. అంతే కాదు పవన్ తో కలసి తిరిగారు. మరి ఆయన గురించి అయినా పవన్ తెలిసి ఉండొచ్చేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే నాదెండ్ల గురించి చెప్పలేదని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎలాంటి శషబిషలూ పెట్టుకోకుండా నాగబాబుకు మంత్రి పదవిని ఇస్తున్నాను అని చెప్పవచ్చు.

ఆయనకు కాదనే వారు కూడా లేరు. దానికి ఇంత కవరింగ్ ఎందుకు అన్న చర్చ వస్తోంది. ఒక వేళ పవన్ చెప్పినట్లుగానే ఆయనకు ఎవరి కులం ఏమిటో తెలియదు అనుకున్నా రాజకీయ నాయకుడిగా పార్టీ అధినేతగా ఆయన వైఖరి తప్పే అని అంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చామని పార్టీలు చెప్పుకుంటాయి.

బడుగులు కూడా అలాంటివి జరగాలని గట్టిగా కోరుకుంటారు. మరి కులం ఏమిటో ఎవరేమిటో తెలియదు అని పవన్ అంటూంటే జనసేన సామాజిక న్యాయం సామాజిక అంశాల పట్ల చైతన్యం ఏ మేరకు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తాయని అంటున్నారు. ఇవన్నీ కాకుండా చూస్తే పవన్ పదేళ్ళుగా అనేక సభలలో మాట్లాడారు,

ఆయన ఎన్నో కులాల గురించి ప్రస్తావించారు. వారికి అవకాశాలు రావద్దా అని నినదించారు కూడా. అందువల్ల పవన్ కి తన పక్కన ఉన్న వారు ఎవరేమిటో తెలియదు అనుకుంటే పొరపాటే అని కూడా అంటున్నారు. ఆయనకు తెలుసు అని అయితే ఆయన నాగబాబు విషయం గురించి చెబుతూ ఇలా చెప్పాలని చెబుతున్నారని అనుకుంటున్నారు.