Begin typing your search above and press return to search.

పవన్ మీద ట్రోల్స్ ఎక్కువ....లోకేష్ మీద తక్కువ ఎందుకు ?

ముఖ్యంగా రాజకీయ నాయకులకు అయితే ట్రోల్స్ విపరీతంగా వచ్చి పడుతూంటాయి.

By:  Tupaki Desk   |   24 March 2025 5:00 PM IST
పవన్ మీద ట్రోల్స్ ఎక్కువ....లోకేష్ మీద తక్కువ ఎందుకు ?
X

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరి మీద అయినా తమకు నచ్చిన తీరులో ట్రోల్స్ చేసి పారేయడం అలవాటుగా మారిపోయింది. ఈ ట్రోల్స్ బారిన పడని ప్రముఖులు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అయితే ట్రోల్స్ విపరీతంగా వచ్చి పడుతూంటాయి.

ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో చూస్తే కాదేదీ అన్నట్లుగా అందరూ ట్రోల్స్ కి గురి అయిన వారే. ఇక నారా లోకేష్ మీద 2014 నుంచి 2019 మధ్యలో పడిన ట్రోల్స్ ఒక లెవెల్ లో అని చెప్పాలి. నిజానికి లోకేష్ వాటిని బాగానే తట్టుకున్నారు. ఆయన మాట్లాడితే చాలు వెంటనే ట్రోల్స్ వచ్చేసేవి. ఆయన 2017 నుంచి 2019 మధ్యలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.

ఇపుడు చూస్తే ట్రోల్స్ లోకేష్ కి బాగా తగ్గాయి. అదే సమయంలో బాబు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ ఒక రేంజిలో వస్తున్నాయి. కారణాలు ఏంటి అన్నది చూస్తే అనేకం కనిపిస్తాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ట్రోల్స్ బాధిత మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు.

లోకేష్ అపుడూ ఇపుడూ మంత్రిగా ఉన్నా కూడా ట్రోల్స్ ఆయనకు ఎందుకు తగ్గాయీ అంటే లోకేష్ లో రాజకీయ పరిపక్వత బాగా వచ్చిందని అంటున్నారు. ఆయన వాడే మాటలను కూడా ఆచీ తూచీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని అంటున్నారు. దాంతో బూతద్దంతో వెతికి లోకేష్ ని బదనాం చేయాలనుకునే వారికి కూడా ఆయన ఎక్కడా చిక్కడం లేదు, దొరకడం లేదు అని అంటున్నారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ట్రోల్స్ బారిన పడుతున్నారు. మెగా బ్రదర్ కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు వల్లనే పవన్ ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతున్నారని అంటున్నారు. నాగబాబు బోల్డ్ గా మాట్లాడేస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు పర్యవసానాలు గురించి పెద్దగా ఆలోచించరని అంటారు. అందుకే ఆయన జనసైనికుల హుషారు కోసమో లేక సభకు వచ్చే వారిని మెప్పించాలనో మాట్లాడేస్తూంటారు.

అవే ఇపుడు పవన్ కళ్యాణ్ ని సైతం ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగితే పవన్ ని గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ ప్రాస కోసం నాగబాబు వాడిన పదాలు కూడా ట్రోల్స్ కి గురి అయ్యాయని అంటున్నారు. దీంతో వైసీపీతో పాటు టీడీపీ సానుభూతిపరులు అయిన వారు కూడా జనసేన పెద్దలను ట్రోల్స్ చేసే పరిస్థితి వస్తోంది అని అంటున్నారు.

ఇక మామూలుగా నెటిజన్లు అయితే ఎపుడూ ట్రోల్స్ కి రెడీగా ఉంటారు. ఎవరేంటి మాట్లాడారు అని తప్పులు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక పవన్ ని మాట మీద నిలకడ లేని మనిషి అని అంటూ ట్రోల్స్ చేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. దానికి వారు గతంలో ఆయన మాట్లాడిన వాటిని ఇప్పుడు మాట్లాడే వాటిని జత చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వీడియో కంటెంట్ ఎపుడూ పదిలంగా ఉంటుంది. దాంతో అవును కదా అని జనాలు అనుకునే పరిస్థితి ఉంది. ఆనాడు ఏమి మాట్లాడారు ఈనాడు ఏమి అంటున్నారు అని కూడా వారు రెండూ చూసి ట్రోల్స్ చేసేందుకు సులువుగా దొరికేస్తున్నారని అంటున్నారు.

మరి ఈ విషయాలు ఏవీ మెగా కుటుంబానికి తెలియవా అని అంటున్నారు. తెలుసు కానీ సభను చూసినపుడు సహజంగా పవన్ కళ్యాణ్ గతాన్ని వర్తమానాన్ని అన్నీ కలిపి మాట్లాడుతూంటారు. సందర్భం కాకపోయినా అనేక విషయాలు ప్రస్తావిస్తారు. గతంలో తాను ఏమి అన్నాను అన్నది పక్కన పెట్టి కొత్తగా స్టేట్మెంట్స్ ఇస్తారు. అవే నెటిజన్లు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ పట్టుకుంటాయని అంటున్నారు.

అదే విధంగా నాగబాబు అయితే ఆవేశంగా మాట్లాడుతారని పేరు. అందులో నుంచి అనేక విషయాలు తీసుకుని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూంటారు. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. తక్కువ మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం అని అంటున్నారు. గతంలో అయితే నాయకులకు ప్రజలకు మధ్య అనుసంధానానికి సభలు మాత్రమే ఒక ఆధారంగా ఉండేవి.

ఇపుడు అలా కాదు ఎన్నో వేదికలు ఉన్నాయి. అందువల్ల బహిరంగ సభలలో గంటల కొద్దీ మాట్లాడుతూ అప్రస్తుత విషయాలు ప్రస్తావిస్తూ ట్రోల్స్ కి గురి అయ్యే బదులు నిర్దిష్ట అంశాల మీద క్లుప్తంగా మాట్లాడితేనే ఎవరైనా ట్రోల్స్ బారి నుంచి తప్పించుకోగలరు అని అంటున్నారు. మెగా బ్రదర్స్ దీనిని గ్రహిస్తారా అన్నదే చూడాలి మరి.