Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ లైఫ్ అంతా ఇంతేనా... జనసైనికుల ఆందోళన

అయితే ఇపుడు జనసేనకు ఇంతలా ఆదరణ ఉన్నా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి నేతలు చేరుతామని చెబుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుమతి కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:14 PM GMT
పవన్ కళ్యాణ్ లైఫ్ అంతా ఇంతేనా... జనసైనికుల ఆందోళన
X

రీల్ లైఫ్ లో పవర్ స్టార్. ఎవరికీ అందనంత ఎత్తులో స్టార్ డం ఉంది. అసంఖ్యాకమైన అభిమానం గణం ఉంది. ఇక రాజకీయాల్లో ఓడినా నెత్తిన పెట్టుకునేంత అభిమానం జనసైనికులకు ఉంది. అయితే అందరి కష్టం ఫలితం పవన్ టీడీపీ కూటమిలో అత్యంత కీలకమైన స్థానానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరో వైపు కేంద్రంలోనూ ఆయనకు విపరీతమైన పలుకుబడి ఉంది. ఆయన ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేసి తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన బాధ్యతలను నూరు శాతం సక్సెస్ చేశారు. అలా కాషాయ దళం లో కొత్త కాంతులు నింపారు. ఇంతలా పవన్ తన పొలిటికల్ చరిష్మాతో దూసుకుపోతున్నా జనసైనికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకలా అంటే అదే కదా మ్యాటర్.

నిజానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడమే కష్టం అని అనుకున్న సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ కావడం, పవన్ జైలుకు వెళ్ళి మరీ ఆయనతో పొత్తు పెట్టుకోవడం బయటకు వచ్చి లోకేష్ బాలకృష్ణ తో కలసి పొత్తు మీద అధికారిక ప్రకటన చేయడం ఇలా చకచకా జరిగిపోయాయి.

ఇక ఈ పొత్తులో భాగంగా కూటమి వలన జనసేనకు ఇచ్చిన 21 సీట్లలోనూ పవన్ పార్టీ నెగ్గింది. నూరు శాతం స్ట్రైక్ కొట్టారు. అయితే ఇపుడు జనసేనకు ఇంతలా ఆదరణ ఉన్నా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి నేతలు చేరుతామని చెబుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుమతి కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు ఎస్ అంటేనే చేర్చుకుంటున్నారని వద్దు అంటే వదిలేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఇక చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ ఇబ్బందిగా ఉండే వారిని ఎవరినీ జనసేనలోకి తీసుకోవడం లేదు అని అంటున్నారు.

ఇలా అయితే జనసేన ఎపుడు ఎదుగుతుంది ఎపుడు 175 సీట్లలో పోటీకి తన అభ్యర్థులను పెడుతుందని జనసేనలో చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో 175 సీట్లు కాస్తా 225 కి పెరిగితే దానికి తగినట్లుగా అభ్యర్థులు కూడా ఆ పార్టీకి కావాల్సి ఉంటుందని అంటున్నారు.

జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను వేసుకోకుండా ఉంటే ఎలా అని అంటున్నారు. బలమైన అభ్యర్ధులు జనసేనకు కూడా ఉండాలి కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబుని పూర్తిగా నమ్ముతూ పవన్ ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.

ఇక చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో చివరి నిముషంలో తన రాజకీయం మార్చరని గ్యారంటీ ఏముంటుందని అంటున్నారు. కేంద్రంలో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఆ వైపుగా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి కదా అని అంటున్నారు. అలా బాబు వెళ్ళినా జనసేన ఆ వైపునకు వెళ్ళలేదు కదా అని జనసైనికులు అంటున్నారు.

వచ్చిన అధికారాన్ని వాడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోకుండా ఉంటే ఇలా ఎంతకాలం చంద్రబాబు మీద ఆధారపడతామని కూడా అంటున్నారు. జగన్ మాదిరిగా కాంగ్రెస్ ని నాశనం చేసి ఆయన ఎదిగినట్లుగా జనసేన కూడా వైసీపీని డ్యామేజ్ చేసి ఎదగాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు.

అయితే ఇలా వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి జనసేన చూడడం లేదు, పొత్తు ధర్మమని అందరికీ ఉపయోగంగా ఉండేలాగానే చేరికలు ఉండాలని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఇదే విషయం తన పార్టీ వారికి చెబుతూ హిత బోధ చేస్తున్నారు. అయితే పవన్ ఈ విధంగా చేయడం పట్ల మాత్రం క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

రాజకీయాలు అంటే నిన్నా నేడూ రేపూ ఒక్కలా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ అంతా లాభం అనే తూకం రాళ్ళలోనే తులాబారం సాగుతుంది. అలాంటపుడు నమ్మకాలు మంచితనాలు విధేయతలు ధర్మాలు అంటూ పొద్దు పుచ్చితే బంగారం లాంటి అవకాశాలు జనసేన జారవిడుచుకున్నట్లే అని అంటున్నారు. మరి ఈ విషయంలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇకనైనా దూకుడుగా వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.