Begin typing your search above and press return to search.

వీడియో: ఉప‌ ముఖ్య‌మంత్రి అయినా కొడుక్కి తండ్రే!

అవును..! ప్ర‌ధాన మంత్రి.. ముఖ్య‌మంత్రి.. ఉప ముఖ్య‌మంత్రి లేదా మంత్రి.. ఎంత పెద్ద నాయ‌కుడు అయినా ఒక కొడుక్కి తండ్రే!

By:  Tupaki Desk   |   13 April 2025 5:35 AM
వీడియో: ఉప‌ ముఖ్య‌మంత్రి అయినా కొడుక్కి తండ్రే!
X

అవును..! ప్ర‌ధాన మంత్రి.. ముఖ్య‌మంత్రి.. ఉప ముఖ్య‌మంత్రి లేదా మంత్రి.. ఎంత పెద్ద నాయ‌కుడు అయినా ఒక కొడుక్కి తండ్రే! నాన్న అనే ప‌దం సెంటిమెంటుతో ముడిప‌డిన‌ది. ఇదిగో ఇక్క‌డ ఈ స‌న్నివేశం చూశాక మ‌రోసారి `తండ్రి కొడుకుల అనుబంధం- సెంటిమెంట్` గురించి చ‌ర్చ మొద‌లైంది. మార్క్ శంక‌ర్ అలా త‌న తండ్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ని పెన‌వేసుకుని భుజంపై నిదురిస్తున్నాడు. జ‌రిగిన ఇన్సిడెంట్ కి అత‌డు ఎంతగా భ‌య‌ప‌డ్డాడో, ఎంత‌గా బాధ‌ను అనుభ‌వించాడో దీనిని బ‌ట్టి కూడా అర్థం చేసుకోగ‌లం.

టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావొచ్చు.. దానికి మించి అత‌డు ఒక తండ్రి. గౌర‌వ‌నీయ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో ఎంత‌గా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అయి ఉన్నారో ఒకే ఒక్క ఘ‌ట‌న నిరూపించింది. ఈ తీవ్ర బాధాకరమైన సంఘటన తర్వాత తన కుటుంబంతో కలిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో గాయపడిన అనేక మంది విద్యార్థులలో మార్క్ కూడా ఒక‌డు. ఈ ప్రమాదం ఒక బిడ్డ ప్రాణాలను కూడా బ‌లిగొంది. ఈ సంఘటన ఏప్రిల్ 8న జరిగింది. సమీపంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు వేగంగా స్పందించి మార్క్ స‌హా ఇతర పిల్లలను ర‌క్షించారు.

చాలా రోజుల ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మార్క్ శంక‌ర్ ఇప్పుడు సురక్షితంగా హైదరాబాద్ ఇంటికి తిరిగి వచ్చాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో పవన్ కళ్యాణ్ తన కొడుకును హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకువెళుతున్న దృశ్యం ప్ర‌జ‌ల్లో భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.

మార్క్‌- ప‌వ‌న్‌ల‌తో పాటు అతని భార్య అన్నా లెజ్నెవా, కుమార్తె పోలేనా అంజనా పవనోవా కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత మార్క్ ను సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అద్భుత‌మైన వైద్యం లభించింది. అతడి చేతులు కాళ్ల‌కు గాయాలు అయ్యాయని, పొగ పీల్చడం వల్ల అతడి ఊపిరితిత్తులు ఇబ్బందిని ఎదుర్కొన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి.

సంఘటన జరిగిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన కొడుకు ఊపిరితిత్తుల నష్టం ఎంతవరకు ఉందో అంచనా వేయడానికి బ్రోంకోస్కోపీ ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో తన రాజకీయ, సినిమా సంబంధిత ప‌నుల‌న్నింటినీ రద్దు చేసుకున్నారు. ప‌వ‌న్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖతో కలిసి వెంటనే సింగపూర్‌కు వెళ్లి మార్క్ చికిత్స పొందుతున్న సమయంలో త‌న పక్కనే ఉన్నారు. జనసేన పార్టీ కూడా ఏప్రిల్ 8న తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ సంఘటనను ధృవీకరించింది.