ఆ విషయం జగన్‌ను ఎందుకు అడగరు: మీడియాకు పవన్ క్వశ్చన్!
నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు.. మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని చెబుతూ.. వారిలో ఉన్న సామర్థ్యాన్ని, పార్టీ కోసం పనిచేసిన తీరును గుర్తించిపదవులు ఇచ్చామన్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 2:54 PM GMTఏపీ మంత్రి వర్గంలో జనసేన నాయకుడు నాగబాబుకు అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మీడియా ప్రతినిధులు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించా రు. ఏప్రాతిపదికన నాగబాబుకు అవకాశం కల్పిస్తున్నారని వారు ప్రశ్నించారు. పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారని.. వారికి కూడా అవకాశం కల్పించవచ్చు కదా! అనేది మీడియా ప్రశ్న. దీనిపై పవన్ కల్యాణ్ ఆసక్తిగా స్పందించారని తెలిసింది.
గతంలో ఏ అర్హతతో జగన్ తమ పార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చారనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఆయనను ఎందుకు అడగరు? నన్నే ఎందుకు కార్నర్ చేస్తున్నారు? అని పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు. దీనికి మీడియా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక, తన వ్యవహారానికి వస్తే.. పనితీరు, పార్టీ పట్ల అంకిత భావంతోపాటు.. సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకుని మంత్రిపదవులు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు.
నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు.. మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని చెబుతూ.. వారిలో ఉన్న సామర్థ్యాన్ని, పార్టీ కోసం పనిచేసిన తీరును గుర్తించిపదవులు ఇచ్చామన్నారు. అసలు కందుల దుర్గేష్ కులం ఏంటో కూడా తనకు తెలియని చెప్పారు. నాగబాబు కూడా పార్టీ కోసం ఎంతో శ్రమించారని తెలిపా రు. వైసీపీ నాయకులతో తిట్లు తిన్నారని.. పార్టీ కోసం రోడ్డెక్కారని చెప్పారు. నాగబాబు విషయంలో అయి నా.. ఎవరి విషయంలో అయినా.. తాను కులం, మతం వంటివి చూడబోనని.. కేవలం పనితీరు మాత్రమే చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపించాలని భావించిన విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ, కుదరలేదని.. దీంతో ఎమ్మెల్సీగా ఆయనను మండలికి పంపించిన తర్వాత.. మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఆలోచన చేయనున్నట్టు తెలిపారు. ఎవరికైనా పనితీరే ప్రామాణికమని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాజకీయాల్లో కులాలు.. మతాలకన్నా.. పనితీరుకే ప్రాధాన్యం ఉంటుందని అదే ప్రజలకు చేరువ చేస్తుందని విశ్వసించే నాయకుల్లో తాను ముందుంటానని పవన్ కల్యాణ్ చెప్పడం గమనార్హం.