బిగ్ టాస్క్ సిద్ధం!.. మోడీకి పవన్ సెంటిమెంట్ అయిపోయారా?
అవును... బీజేపీ నేతలకు, ప్రధానంగా మోడీకి పవన్ తో మంచి బాండింగ్ ఉందని చెబుతుంటారు.
By: Tupaki Desk | 27 Jan 2025 8:30 PM GMTప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కల్యాణ్ కు మధ్య ఏదో తెలియని బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తుందని.. వారిద్దరూ ఒకరిని చూసుకుని ఒకరు చాలా ఆత్మీయంగా ఫీలవుతుంటారని.. పవన్ ని చూస్తే మోడీ ఫుల్ ఖుషీ అయినట్లు కనిపిస్తే, మోడీని చూసిన పవన్ మరింత అత్మవిశ్వాసంతో ఉంటారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును... బీజేపీ నేతలకు, ప్రధానంగా మోడీకి పవన్ తో మంచి బాండింగ్ ఉందని చెబుతుంటారు. గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఆ స్థాయి విజయం దక్కడంలో పవన్ పాత్రను మోడీ బాగా గుర్తించారని చెబుతుంటారు. దీంతో... గత ఏడాది నవంబర్ లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పిలిపించారు.
ఇందులో భాగంగా... గత ఏడాది నవంబర్ 16, 17 తేదీల్లో మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఏపీ నుంచి బయలుదేరి వెళ్లారు. సినీ నటుడిగా, పొలిటీషియన్ గా పవన్ కున్న ఛరిష్మాను ఉపయోగించుకునే విషయం బీజేపీ తగ్గేదేలే అనే కామెంట్లు నాడు వినిపించాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల పాటు పవన్ అవిరామంగా ప్రచారం చేశారు.
అయితే.. ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ ప్రచారం చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో... మహారాష్ట్రలో ఉన్న తెలుగువారిని పవన్ గట్టిగానే ఆకర్షించారనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో... ఢిల్లీలోనూ పవన్ ని కంటిన్యూ చేయాలని మోడీ & కో భావిస్తున్నారని అంటున్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఫిబ్రవరి 3తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు, హామీల వర్షాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో.. పవన్ ని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు.
వాస్తవానికి ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది వరకూ తెలుగు ఓటర్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు. దీంతో... వారిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏపీ, తెలంగాణల నుంచి బీజేపీ నేతలకు హస్తిన ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక తెలుగు సంఘాలతోనూ టచ్ లో ఉండమని సూచించారని అంటున్నారు.
మరోపక్క ఎంతమంది నేతలున్నా పవన్ ప్రచారం లెక్క వేరు అని భావించారో.. లేక, మహారాష్ట్ర సెంటిమెంట్ లో భాగంగానో తెలియదు కానీ.. పవన్ ను మరోసారి ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఫిక్సయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ తో ఢిల్లీలో కనీసం రెండు రోజులు ప్రచారం చేయించనున్నారని కథనాలొస్తున్నాయి.
మరి జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పవన్ కల్యాణ్ ఛరీష్మాను ఉపయోగించుకుంటుందా..? ఈసారి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర స్థాయిలోనే ఆకర్షిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే.. మోడీకి పవన్ ఓ సెంటిమెంట్ గా మారినట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.