పవన్ లోకేష్.... ఆల్ ఈజ్ వెల్ !
ఇటీవల కాలంలో తెలుగు తమ్ముళ్ళ ఉప ముఖ్యమంత్రి నినాదం కొంత రాజకీయ అలజడి సృష్టించింది.
By: Tupaki Desk | 26 Jan 2025 10:30 PM GMTఇటీవల కాలంలో తెలుగు తమ్ముళ్ళ ఉప ముఖ్యమంత్రి నినాదం కొంత రాజకీయ అలజడి సృష్టించింది. నారా లోకేష్ కి అర్జెంటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రమోట్ చేయాలని వరసబెట్టి సీనియర్ జూనియర్ తమ్ముళ్ళు అంతా కోరస్ గా ఈ నినాదాన్ని అందుకున్నారు. దాని మీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది.
వ్యవహారం శృతి మించి పోయింది అని గ్రహించిన తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ తమ క్యాడర్ కి కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఉప ముఖ్యమంత్రి అంశం మీద మాట్లాడవద్దు అంటూ హెచ్చరించాయి. దాంతో వివాదం తాత్కాలికంగా చప్పబడిపోయింది.
ఇదిలా ఉంటే ఈ ఇష్యూ తరువాత 76 వ గణతంత్ర వేడుకలు ఆ మీదట గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో పవన్ లోకేష్ పరస్పరం ఆహ్లాదకరమైన వాతావరణంలో పలకరించుకుని మాట్లాడుకున్నారు.
ఇద్దరి మధ్యన నవ్వులు పువ్వుల్ విరిసాయి. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అభిమానంగా ఆప్యాయంగా ఉన్నట్లుగా విజువల్స్ బయటకు వచ్చాయి. దానిని చూసిన వారు అంతా ఆల్ ఈజ్ వెల్ అని అనుకునే లాగా ఉంది. ఇక విజయవాడ పేరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు మొదట నారా లోకేష్ వచ్చారు. ఆయన అందరినీ పలకరించుకుంటూ వెళ్ళారు. ఇక ఆయన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇక వేదిక మీద చంద్రబాబు పవన్ లోకేష్ ముగ్గురూ పక్క పక్కనే ఆసీనులు అయ్యారు.
చంద్రబాబు పవన్ మాట్లాడుకుంటూ కనిపించారు. అలాగే పక్కనే ఉన్న లోకేష్ తో పవన్ ఏదో విషయం మీద మాట్లాడుతూ కనిపించారు. ఇద్దరూ అనేక విషయాలు మాట్లాడుకున్నట్లుగా కనిపించారు. కట్ చేస్తే ఈవెనింగ్ రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో కూడా ఒకే టేబిల్ వద్దనే పవన్ లోకేష్ చంద్రబాబు కూర్చున్నారు. అంతా కలసి మొత్తం కార్యక్రమాన్ని అహ్లాద పూర్వకమైన వాతావరణంలో తిలకించారు.
దీనిని చూసిన వారు ఈ ముగ్గురూ సజావుగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. నాయకుల మధ్యన ఎలాంటి గ్యాప్ అన్నది లేదు అని అనుకుంటున్నారు. అలాగే అగ్ర నేతల వైఖరి కూడా ఉంది.
ఇక టీడీపీ కూటమిని ఎవరు విచ్చిన్నం చేయాలని చూసినా లేక గ్యాప్ ని కావాలని పెట్టాలని చూసినా వారు ఏ విధంగానూ సక్సెస్ కాలేరని ఈ నేతల తీరు అర్ధమయ్యేలా చేసింది.
ఇక అయిదేళ్ళ పాటు ఎలాంటి అరమరికలు లేకుండా ఈ పొత్తు కొనసాగుతుందని మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని జనసేన టీడీపీ ఇప్పటికే ఒక క్లారిటీ మీద ఉన్న వేళ చిన్న విషయాలు ఏవీ పెద్ద రచ్చకు దారి తీయవని మరోసారి రుజువు అయింది అంటున్నారు.