పవన్ Vs లోకేశ్.. పోటాపోటీగా ఆధ్యాత్మిక యాత్రలు!
ఏపీలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆధ్యాత్మికత కోరుకుంటున్నారు. సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే దక్షిణాదిలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 8:17 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆధ్యాత్మికత కోరుకుంటున్నారు. సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే దక్షిణాదిలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజుల పర్యటన బుధవారమే మొదలైంది. తొలిరోజు కేరళలోని అగస్థ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు పవన్. ఇక గురు, శుక్రవారాల్లోనూ ఆయన పర్యటన కొనసాగనుంది. మరోవైపు ఆయన సహచరుడు, ఏపీ హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ బాటలోనే నడుస్తున్నారు.
పవన్ సనాతన ధర్మం అంటూ దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తుంటే.. లోకేశ్ కూడా ఇప్పుడు ఆధ్యాత్మికతనే ఎంచుకున్నారు. అయితే ఆయన పవన్ అనుసరిస్తున్నట్లు ఏ దీక్షలు చేయకుండా.. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగలా భావిస్తున్న మహా కుంభమేళాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహా క్రతువులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక తాను కూడా మహా కుంభమేళాలో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
మహాకుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వచ్చారని చెబుతున్నారు. ఈ నెల 26 వరకు ఈ మహా యజ్ఞం కొనసాగుతుంది. దీంతో పుణ్య స్నానాలు చేసేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో త్రివేణీ సంగమం భక్తులతో పోటెత్తుతోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో ప్రయాగ్ రాజ్ ను నో వెహికల్ జోన్ గా ప్రకటించారు.
144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాలో ఒకసారి స్నానం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ప్రతి హిందువు భావిస్తాడు. త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగి దేహత్యాగానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఆరు ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు. ఇక పవిత్ర స్నానం తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్షయ వటవృక్షాన్ని ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న మాధవేశ్వరీ శక్తి పీఠాన్ని దర్శిస్తారు. అయితే ఈ నెల 17న కుటుంబంతో సహా మహా కుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకున్న మంత్రి లోకేశ్.. ఉత్తరాదిలోని పలు పుణ్య క్షేత్రాలను దర్శించనున్నారు.
17న భార్య బ్రహ్మణితో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లనున్న లోకేశ్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత వారణశికి బయలుదేరి వెళ్లనున్నారు. కాశీ క్షేత్రపాలకుడైన మహా కాలభైరవేవ్వరుడి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేయనున్నారు. వారణశి ఘాట్ ను సందర్శించి గంగా హారతి ఇవ్వనున్నారని లోకేశ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. మరోవైపు పవన్ తన పర్యటన ముగించిన వెంటనే లోకేశ్ ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరి వెళ్లడం విశేషం.