మరో పదేళ్లలో జాతీయ నేతగా పవన్ ..!
అలానే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా.. అత్యంత వేగంగాజాతీయ నేతగా ఎదిగే అవకాశం ఉందంటూ.. జాతీయ మీడియా ఓ కథనం రాసుకొచ్చింది.
By: Tupaki Desk | 29 Oct 2024 7:30 PM GMTరాజకీయాల్లో నాయకుల పురోగమనం.. ఎలాగైనా ఉంటుంది. దీనిని అంచనా వేయడం కష్టం. ఎందుకు పనికిరాదు.. అయిపోయిందని అనుకున్న పార్టీ కూడా.. ఉత్తేజంతో ఉరకలేసి అధికారంలోకి వచ్చిన పరి స్థితి తెలిసిందే. అదేవిధంగా నాయకులు కూడా పుంజుకున్న పరిస్థితి దేశంలోను రాష్ట్రంలోనూ కామనే. అలానే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా.. అత్యంత వేగంగాజాతీయ నేతగా ఎదిగే అవకాశం ఉందంటూ.. జాతీయ మీడియా ఓ కథనం రాసుకొచ్చింది.
ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీ తరఫున బలమైన గళం వినిపించే నాయకుడు లేకపోవడం..ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు పవన్ వంటి వారివైపు కమలనాథులు చూస్తున్నారన్నది జాతీయ వర్గాల అభిప్రాయం. ఇది వాస్తవమే. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, కేరళ వంటి ప్రాంతాల్లో బీజేపీ వేళ్లూనుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఒక్క కర్ణాటకలో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా, తెలంగాణలో మాత్రం.. రెండో స్థానంలో నిలిచింది.
వచ్చే ఎన్నికల నాటికి.. అంటే.. జమిలి ఎన్నికలు వస్తే.. ఆ సమయానికి లేదా 2029 నాటికి బీజేపీ దక్షిణా ది రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇటువైపు.. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరాదిలో కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే.. దక్షిణాదిపై కొన్నాళ్లుగా మోడీ, అమిత్‌షాలు.. ప్రత్యేక దృష్టి పెట్టి.. పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిధులు కూడా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవడమే దీనివెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
ఇలాంటి తరుణంలో.. పవన్ వంటి సనాతన ధర్మ పరిరక్షకులను తన చెంతనే ఉంచుకోవడం .. వారిని మరింత తనకు అనుకూలంగా మార్చుకోవడంపై బీజేపీ దృష్టి పెడుతున్నట్టు ప్రస్తుతం వస్తున్న అంచ నాలు. ఇదే జరిగితే.. వచ్చే పదేళ్లలో పవన్ జాతీయస్థాయి నాయకుడిగా పెరుగుతారన్నది సారాంశం. ప్రస్తుతం ఏపీ నుంచి చంద్రబాబుకు మాత్రమే ఈ తరహా అనుభవం.. పేరు ఉన్నాయి. పదేళ్ల తర్వాత.. ఈ స్థానాన్ని పవన్ కైవసం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి బీజేపీ ఇతోథికంగా సాయం చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.