పవన్ జాతీయ అడుగులకు తొలి బీజం
జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకున్న సినీ ఇమేజ్ తో పాటు జాతీయ భావజాలాన్ని ఆసరాగా చేసుకుని జాతీయ రాజకీయాల్లో వెలుగొందాలని చూస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది.
By: Tupaki Desk | 16 March 2025 4:00 AM ISTజనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకున్న సినీ ఇమేజ్ తో పాటు జాతీయ భావజాలాన్ని ఆసరాగా చేసుకుని జాతీయ రాజకీయాల్లో వెలుగొందాలని చూస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. దానికి కారణం ఆయన జనసేన 12వ ఆవిర్భావ వేడుకలలో పలు భాషలలో మాట్లాడడం. హిందీ, తమిళం సహా ఇతర భాషలలో పవన్ ప్రసంగం చేశారు.
అంతే కాదు ఆయన దేశంలోని అనేక సమస్యలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిజానికి జనసేన ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ తన ప్రస్థానం గురించి తెలుగు రాజకీయాల గురించి చెప్పుకుంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా జాతీయ అంశాలను ఎక్కువగా ప్రస్తావించడం విశేషం.
ఆయన డీలిమిటేషన్ గురించి మాట్లాడారు, అలాగే త్రిభాషా విధానం గురించి కూదా ప్రస్తావించారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లలో హిందువుల మీద జరుగుతున్న దాడులను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. అదే విధంగా ఇప్పటికి పాతికేళ్ల క్రితం జరిగిన గోద్రా అల్లర్ల మీద కూడా మాట్లాడారు.
వీటి మీద తనదైన స్పష్టమైన అభిప్రాయాన్ని ఆయన తెలియచేస్తూ ప్రత్యర్థుల మీద ద్వజమెత్తారు. దాంతో పవన్ జాతీయ రాజకీయాల మీద తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. నిజానికి పవన్ హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున హాజరయ్యారు.
ఆయన అక్కడ సభలలో ప్రసంగించినపుడు పెద్ద ఎత్తున ప్రజానీకం ఆయనకు మద్దతుగా జేజేలు పలికారు. అలగే తమిళనాడులోని దేవాలయాలను ఆయన సందర్శించినప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆయనతో కనెక్ట్ అయ్యారు. వారు పవన్ ప్రసంగాలను చూస్తూంటారని ఆయన రాజకీయ వైఖరిని గమనిస్తూంటారని జనసైనికులు చెబుతున్నారు.
ఇక బీజేపీ జాతీయ వాద పార్టీగా ఉంది. పవన్ కూడా జాతీయ భావాలతో ఉన్నారు. మరో వైపు చూస్తే బీజేపీకి పవన్ నమ్మకమైన మిత్రుడిగా ఉన్నారు. దాంతో బీజేపీ ప్రోత్సాహం పవన్ ఉత్సాహం కలిస్తే కనుక ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఎంతో దూరంలో లేదని అంటున్నారు.
బీజేపీకి సౌత్ ఫేస్ కావాలి. దానికి గ్లామర్ టచ్ ఇచ్చే వ్యక్తిగా మంచి వక్తగా పవన్ ని ఆ పార్టీ చూస్తోంది. ఉత్తరాదిన హిందూత్వ నినాదాన్ని వినిపించేందుకు బీజేపీకి ఎంతో మంది ఉన్నారు. కానీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీకి ఈ కొరత వెంటాడుతోంది. దాంతో పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీ భారీ సాయమే ఆశిస్తోంది. దానికి తగినట్లుగా పవన్ కూడా బీజేపీకి మద్దతుగానే జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడారు.
బీజేపీ వ్యతిరేకుల మీద ఆయన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. నిన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద ఆయన విమర్శలు చేశారు మహా కుంభను మృత్యు కుంభ తో పోల్చడం పట్ల ఆయన ఘాటుగా రియాక్టు అయ్యారు. హిందువుల మీదనే సులువుగా విమర్శలు చేయగలుగుతారు అని పవన్ మమతకు ధీటైన బదులు ఇచ్చారు.
ఇపుడు తమిళనాడు సీఎం స్టాలిన్ వంతుగా ఉంది. ఆయన హిందీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాని మీద పవన్ జనసేన ఆవిర్భావ సభలో గట్టిగానే జవాబు చెప్పారు. హిందీ దేశ భాషలలో ఒకటని దానిని ఎలా కాదంటామని ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా పవన్ జాతీయ రాజకీయాలలో తన వంతు పాత్ర ఏమిటో మెల్లగా చెబుతున్నారు. రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.
ఇక జనసేన ఆవిర్భావ సభలో జనసేనలో నంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ అయితే పవన్ ని జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని పవన్ సేవలు దేశానికి ఉపయోగపడేలా ఆయన ఎదగాలని గట్టిగా కోరుకున్నారు. సో పవన్ జాతీయ అడుగులకు తొలి బీజం ఆవిర్భావ సభలో పడిందా అంటే వెయిట్ అండ్ సీ.