ఎన్డీయే భేటీకి పవన్ గైర్ హాజర్... ఎందుకలా ?
పవన్ రానంతమాత్రాన అది రాజకీయంగా చర్చించాల్సిన పెద్ద విషయం కాదని కూడా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ సైతం అంటున్నాయి.
By: Tupaki Desk | 25 Dec 2024 4:30 PM GMTఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే కీలక భేటీకి మిత్రపక్షం జనసేన హాజరు కాలేదు. ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి ఈ సమావేశానికి గైర్ హాజరు అయ్యారు. దీంతో ఎందుకలా అన్న చర్చ అయితే బయల్దేరింది. పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులు అనంది వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి వద్ద అపరిమితమైన పలుకుబడి ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే జనసేనను మిత్రపక్షంగా కాకుండా తమ సొంత పక్షంగా బీజేపీ పెద్దలు భావిస్తారు అని అంటారు. ఒక నెల క్రితం హర్యానాలో జరిగిన ఎన్డీయే భేటీకి పవన్ హాజరు అయినపుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో నవ్వుతో కరచాలనం చేస్తూ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
అంతలా పవన్ ని మోడీ అమిత్ షా అభిమానిస్తారు. ఎన్డీయేలో పవన్ అంతర్భాగం అని అంటారు. ఇంకో మాట చెప్పాలీ అంటే ఏపీలో టీడీపీ కూటమి కట్టించి అందులో బీజేపీని చేర్చి మూడవ సారి జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పవన్ కారణం అన్నది కూడా ఒక వాస్తవమైన రాజకీయ విశ్లేషణగా అంతా చూస్తారు.
ఇవన్నీ పక్కన పెడితే రెండు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. మరి పవన్ బుధవారం నాటికి చేరుకుని ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశానికి హాజరు అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. అయితే వ్యక్తిగత పనుల వల్లనే ఆయన వెళ్లలేకపోయి ఉండవచ్చు అని అంటున్నారు.
పవన్ రానంతమాత్రాన అది రాజకీయంగా చర్చించాల్సిన పెద్ద విషయం కాదని కూడా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ సైతం అంటున్నాయి. ఆయన అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడిగా బీజేపీ పెద్దలు ఎపుడో గుర్తించారని అంటున్నారు. అయితే ఆప్నాదళ్ వంటి చిన్న పార్టీల అధినేతలు కూడా హాజరైన ఈ సమావేశానికి జనసేన వెళ్ళకపోవడం మీద మాత్రం చర్చ సాగుతోంది.
పవన్ వెళ్లకపోవడానికి పెద్దగా కారణాలు వెతకాల్సిన పని లేదని ఎన్డీయే ఏ డెసిషన్ తీసుకున్నా ఆయనకు అభ్యంతరాలు ఉండవని అంటున్న వారూ ఉన్నారు. ఇక పవన్ బీజేపీకి దూరంగా జరగాలని అనుకోవడం లేదు అంటున్నారు. అంతే కాదు ఆయన బీజేపీకి మరింత దగ్గరగా కూడా ఉన్నారని గడచిన పరిణామాలను చూసి చెబుతున్న వారూ ఉన్నారు.
అదే సమయంలో బీజేపీ పెద్దలు కూడా పవన్ ని ఎప్పటికీ దూరం చేసుకోరని అంటున్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం కావాలని వారికి పట్టుదల ఉంది. దానికి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అండ అవసరం అన్న భావనతో కమలనాధులు ఉన్నారు. ఆయన కూడా సనాతన ధర్మం అంటూ బీజేపీ లైన్ నే వినిపిస్తున్న వేళ ఆయన ఎన్డీయే భేటీకి వెళ్లకపోవడానికి రాజకీయేతర కారణాలుగానే చూడాలి తప్ప పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారు.
అయితే ఒకవైపు పవన్ ఎంతగానో అభిమానించే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి వేడుకలు ఢిల్లీలో జరుగుతున్నాయి. అదే విధంగా ఎన్డీయే మీట్ ఉంది. దాంతో పవన్ వెళ్ళి ఉంటే బాగుండేది అన్న మాట అయితే ఉంది. మరి పవన్ ఏ కారణం చేత వెళ్లకపోయినా ఆయన గైర్ హాజర్ అనేది రాజకీయంగా సంచలనం రేకెత్తించే ఇష్యూ అయితే కాదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.