Begin typing your search above and press return to search.

పవన్ సరే...లోకేష్ సంగతేంటి ?

ఇవన్నీ పక్కన పెడితే నిండు సభలో తనకు సీఎం సీటు మీద ఆశ లేదని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా చాటుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 9:30 AM GMT
పవన్ సరే...లోకేష్ సంగతేంటి ?
X

పదవులు అన్నవి ఎవరికైనా ఇష్టమే. వాటి మీద ఎంతటి వారికైనా మోజు ఉండడం సహజం. చివరికి రక్తసంబంధం లో కూడా పదవులు చిచ్చు పెడతాయి. దానికి తెలుగు నాట రాజకీయాలు పరికిస్తే చాలు వేరే ఎక్కడి ఉదాహరణలూ అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నిండు సభలో తనకు సీఎం సీటు మీద ఆశ లేదని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా చాటుకున్నారు.

ఏపీకి చంద్రబాబు ఈ టెర్మ్ కాకుండా మరో రెండు టెర్ములు అంటే ఇంకా పదేళ్ళు టోటల్ గా 15 ఏళ్ళ పాటు సీఎం గా ఉండాలని ఆయన బలంగా కోరుకున్నారు. అంటే పవన్ ఆలోచనల మేరకు బాబు సీఎం గా రిటైర్ కావాల్సింది 2038లో అన్న మాట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయిదున్నర దశాబ్దాల ఏజ్ లో ఉన్నారు. మరో పదిహేనేళ్ళు అంటే ఆయనకు సీఎం యోగం కలిగే నాటికి డెబ్బై లోకి వెళ్తారు అని అంటున్నారు

అయినా తాను కోరుకున్నారు కాబట్టి ఆయన ఎంతకాలం అయినా వేచి ఉండగలరు. మరి టీడీపీలో చినబాబు లోకేష్ సంగతేంటి అన్న చర్చ నడుస్తోంది. లోకేష్ ని 2019లో కనుక రెండోసారి టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం గా చేస్తారు అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ మధ్యలో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయిపోయారు.

ఇక 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలతో బంపర్ మెజారిటీ ఉన్నా బాబు సీఎం గా కొనసాగుతున్నారు. అయినా జమిలి ఎన్నికల తరువాత అయినా టీడీపీ కూటమి మళ్లీ గెలిచి వస్తే లోకేష్ ని సీఎం గా చేస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

అంటే 2027లో జమిలి ఎన్నికల్లో కూటమి గెలిస్తే సీఎం అయ్యేది ఈసారి లోకేష్ అని అంటున్నారు. వాటిని పూర్వపక్షం చేసేలా పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన ఉందని అంటున్నారు. బాబే ఎప్పటికీ కూటమికి సీఎం అంటే మరి లోకేష్ బాబు ఆశలు ఏమి కావాలి అన్న చర్చ కూడా టీడీపీ యూత్ వింగ్ తో పాటు చాలా మందిలో కలుగుతోంది.

చంద్రబాబు వయసు ఏడున్నర పదులు. షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగితే బాబుకు ఎనభై ఏళ్ళు వస్తాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే లోకేష్ ని సీఎం చేయడమే బాబు ఆలోచన అని కూడా అంటున్నారు. ఎందుకంటే బాబు తన పార్టీని కాపాడుకోవాలి. తన రాజకీయ వారసత్వాన్ని కూడా పటిష్టం చేసుకోవాలి.

ఇప్పటికే ఆ విధంగా లోకేష్ ని పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాంతో లోకేష్ చుట్టూ యువతరం అంతా ర్యాలీ అవుతోంది. అటు పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల లోకేష్ అమెరికా టూర్ పూర్తి చేసుకుని వచ్చిన నేపథ్యంలో టీడీపీకి చెందిన మంత్రులు అంతా ఆయన ఇంటికి వెళ్ళి మరీ అభినందించి వచ్చారు.

ఇవన్నీ కళ్ళ ముందు ఉండగా బాబే 2039 దాకా సీఎం అంటే మరో పదిహేనేళ్ళు అంటే లోకేష్ బాబుకు కూడా అప్పటికి అయిదున్నర పదుల వయసు దాటేస్తుంది. పైపెచ్చు ఆయన ఆశలు కూడా అప్పటిదాక దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి లోకేష్ తన తండ్రి సీఎం కాబట్టి తాను ఆగినా ఆయన చుట్టూ అల్లుకున్న యంగ్ టీం ఆగుతుందా అన్నది కూడా చర్చగా ఉంది.

వీటితో పాటు మరో పాయింట్ ఏంటి అంటే చంద్రబాబు తరంలోని వారు చాలా మంది కేంద్ర స్థాయిలోకి వెళ్ళి కీలకమైన మంత్రులుగా పనిచేస్తూ వచ్చారు. బాబు ఎప్పటికీ సీఎం గానే ఉండిపోవాలా అన్న చర్చ కూడా ఒక వైపు సాగుతోంది. చాన్స్ దొరికితే బాబు ప్రధాని కూడా ఎందుకు కాకూడదు అన్నది కూడా మరో చర్చగా ఉంది.

జమిలి ఎన్నికల్లో మెజారిటీ ఎవరికీ రాకపోతే గోల్డెన్ చాన్స్ తగిలితే దేశంలోకి సీనియర్ మోస్ట్ లీడర్ గా బాబు ప్రధాని పదవికి ఎందుకు పోటీ పడకూడదు అన్నది కూడా ఉంది. అటు ఎన్డీయేకు ఇటు ఇండియా కూటమికి కూడా బాగా కావాల్సిన నేతగా బాబు ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే ఆయన వారసుడిగా సీఎం సీట్లో లోకేష్ కూర్చునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని అంటున్నారు. అలా భవిష్యత్తు రాజకీయం ఎవరూ ఊహించనిది కూడా జరగవచ్చు అని అంటున్నారు.

వాటికి మించి లోకేష్ నాయకత్వం రావాలని కావాలని కోరుకుంటున్న వారూ టీడీపీలో హెచ్చుగా ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ చంద్రబాబే ఎప్పటికీ సీఎం అని చేసిన ప్రకటనలతో లోకేష్ ముందర కాళ్ళకు బంధం వేశారా అన్న చర్చ కూడా సాగుతొంది. లోకేష్ కి పెరుగుతున్న ప్రయారిటీ పవన్ కి కూడా తెలియకుండా పోదు అనే అంటున్నారు. మరి అలాంటి వ్యూహంతో కనుక ఆయన ఈ ప్రకటన చేసి ఉంటే మాత్రం అదుర్స్ అనాల్సిందే. ఏది ఏమైనా మీరే ఎప్పటికీ సీఎం అన్న పవన్ మాటకు బాబు నవ్వుతూనే రిసీవ్ చేసుకున్నా కాలం ఏమి తీర్పు చెబుతుంది అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.