అప్పుడు బూతు తిట్టి.. ఇప్పుడు నీతులా? మాజీ మంత్రి పేర్నికి డిసీఎం పవన్ ప్రశ్న
అధికారంలో ఉండగా బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించారు పవన్.. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు
By: Tupaki Desk | 30 Dec 2024 10:20 AM GMTమాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు ఇష్టారీతిన నోరు పారేసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేషన్ బియ్యం మాయం కేసు.. మాజీ మంత్రి పేర్ని నానిపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం మాయమవడం నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. డబ్బులు కట్టేశాం అంటే ఎలా? తప్పు జరిగింది కదా? తప్పు చేశారు కాబట్టే కేసు పెట్టారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గొడౌన్ పెట్టింది ఎవరు..? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను కేసుల్లో ఇరికించలేదే. ఆయన చేసిన తప్పు వల్లే వారి ఇంట్లో ఆడవాళ్లు వీధిలోకి వచ్చారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉండగా బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించారు పవన్.. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అటవీ శాఖలో జరుగుతున్న స్మగ్లింగ్ దారుణాలు ఇంకెక్కడా లేవన్న పవన్.. తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ అద్దెకిచ్చిన గొడౌన్లో రేషన్ బియ్యం మాయమైనట్లు మచిలీపట్నం పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. అయితే కేసు నమోదైన వెంటనే బియ్యం విలువను చెబితే డబ్బు చెల్లిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. రూ.1.70 కోట్లు విలువైన రెండు చెక్కులను అందజేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం చర్యలకు సిద్ధమవడంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి పేర్ని నాని బయటకు వచ్చి తనపై కక్షతో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్లో అధికారులు నడుచుకుంటున్నారని విమర్శించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, ఇళ్లలో ఆడవాళ్లను వేధించడం తగదంటూ మండిపడ్డారు. దీనిపై ఆదివారం మంత్రి కొల్లు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వంటివారు తీవ్రంగా స్పందించగా, సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కూడా విమర్శలు గుప్పించారు. నాని చేసిన తప్పుల వల్లే ఆయన కుటుంబ సభ్యులు, ఆడవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తొలి ఆరు నెలల పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ ఆరు నెలల పాలనకు తేడా గమనించాలని కోరారు.
రెండు ప్రభుత్వాల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నుంచి పాలన, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల కోసమే పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తాము ఎంతో బాధ్యతతో పనిచేస్తున్నామన్నారు. పదవులు అనుభవించకన్నా, బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, తాగునీరు పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకే ఎక్కువ ప్రాధన్యమిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు పాలన బాగుండాలని చూశామని, ఇకపై క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటామన్నారు.