Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటుని పవన్ అడ్డుకుంటారా ?

కేంద్ర పెద్దల వద్ద మంచి పలుకుబడి పవన్ కళ్యాణ్ కి ఉందని అంతా భావిస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   6 Oct 2024 12:30 PM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేటుని పవన్ అడ్డుకుంటారా ?
X

కేంద్ర పెద్దల వద్ద మంచి పలుకుబడి పవన్ కళ్యాణ్ కి ఉందని అంతా భావిస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. రెండేళ్ళ క్రితం సరిగ్గా ఇదే నెలలో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ని ప్రత్యేకంగా విశాఖకు పిలిపించుకుని గంటకు పైగా భేటీ వేశారు.

దానిని చూసిన వారు పవన్ కి మోడీ దగ్గర ఇంత పలుకుబడి ఉందా అని ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం జగన్ వేదిక మీద ప్రధానిని కలిశారు. కానీ పవన్ మాత్రం ఒక రోజు ముందే మోడీతో సమావేశం అయి మొత్తం ఏపీ రాజకీయాల మీద ముచ్చటించారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ అంటే ఒక తుఫాను అని ఏకంగా ఎన్డీయే మిత్రుల సమావేశంలో మోడీ చెప్పిన సంగతి కూడా గుర్తు ఉండే ఉంటుంది. అంతలా పవన్ కి మోడీ వద్ద పలుకుబడి ఉంటే దానిని ఆయన ఏపీ మేలు కోసం వాడవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది.

సరిగ్గా ఇపుడు అదే పాయింట్ మీద ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ని విశాఖ ఉక్కు కార్మిక సంఘం నేతలు కలుస్తున్నారు. పవన్ తోనే వారు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. పవన్ ఒక్కడే తన చక్రం అడ్డు వేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపించగలరు అన్నది కూడా వారికి ఉన్న నమ్మకం.

దాంతో పవన్ కోర్టులోకి ఉక్కు కర్మాగారం బంతి వచ్చి పడింది. విశాఖ ఉక్కుని నడపాలీ అంటే పది వేల కోట్ల దాకా వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. అలాగే నష్టాలను కేంద్రం మాఫీ చేయాలి. సొంత నిధులను సమకూర్చాలి. వివిధ విభాగాలలో పోస్టులు ఎన్నో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయించాలి.

ఇక ఎపుడూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసేందుకు తాము సిద్ధపడమని చెప్పగలగాలి. దేశమో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ. అంతే కాదు జల రవాణాతో ఎంతో తక్కువ ఖర్చుతో అంతర్జతీయంగా ఎగుమతులకు విశాఖ పోర్టులో అవకాశం ఉంది.

అదే విధంగా చూస్తే విశాఖ నుంచి తయారయ్యే స్టీల్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు ప్రోడక్షన్ వల్ల రావడం లేదు. ప్రొడక్షన్ కి తగిన మార్కెట్ ఉంది. ఇంకా ఎక్కువ ప్రోడక్షన్ ఇచ్చినా దానికి తగిన గిరాకీ ఉంది.

అయితే సొంత గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయి. సొంత గనులు లేకుండా దశాబ్దాలుగా నడుస్తున్న స్టీల్ ప్లాంట్ కూడా దేశంలో విశాఖ ఒక్కటే. ఈ విషయాలు అన్నీ అందరికీ తెలుసు. కానీ స్టీల్ ప్లాంట్ నష్టాలు కష్టాలు అని వదిలించుకోవడానికి చూస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ని తీసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు ఎగబడుతున్నాయంటే స్టీల్ ప్లాంట్ మీద వారికి ఉన్న నమ్మకం ప్రభుత్వ పెద్దలకు లేదా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ అయితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానీయం అని గతంలో చాలా సార్లు చెప్పారు. ఇపుడు ఆయనే కేంద్ర పెద్దలతో మాట్లాడి ప్లాంట్ ని కాపాడాలని కోరుకుంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే ఒక డెసిషన్ కి వచ్చేసిన కేంద్రం పవన్ మాటను వింటుందా అన్నది కూడా చర్చగా ఉంది.

పవన్ తో పాటు చంద్రబాబు కూడా కలసి కేంద్రం మీద ఒత్తిడి తీవ్రంగా పెట్టాలని అంటున్నారు. ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే కనుక మేము ఎండీయే కూటమిలో ఉండమని తెగేసి చెప్పాలి. రాజకీయ ఒత్తిడితోనే ప్లాంట్ బతికి బట్టకడుతుందన్న్న మాట కూడా ఉంది.