వైసీపీ విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తుకొచ్చింది : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 25 Feb 2025 12:41 PM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "కింద పడతాం... మీద పడతాం... మా కుటుంబం విషయం. ఏం జరిగినా మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. వైసీపీని సభలో అడుగుపెట్టనివ్వం, అధికారంలోకి రానివ్వం" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి.
- సంకీర్ణ ప్రభుత్వంపై పవన్ స్పష్టత
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో "సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, 15 ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగుతుంది. మేము కలిసి లేకుంటే, ప్రజలకు ద్రోహం చేసినట్లే" అని పేర్కొన్నారు. అలాగే, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి రావడానికి అర్హత లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- వైకాపా ప్రభుత్వంపై విమర్శలు
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో వైకాపా హయాంలో చోటుచేసుకున్న అనేక అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఎత్తిచూపుతూ, "వైకాపా హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. జల్ జీవన్ మిషన్ నిధులను దుర్వినియోగం చేశారు. 22 వేలకుపైగా గోకులాలు నిర్మించాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లను వేయగా, మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 4000 కిలోమీటర్లకు పైగా నిర్మాణం చేపట్టాం" అని వివరించారు.
-గవర్నర్‌పై వైకాపా నేతల ప్రవర్తనపై ఆగ్రహం
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైకాపా నేతలు చూపిన అసభ్య ప్రవర్తనపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన గౌరవనీయమైన వ్యక్తి. ఆయన ప్రసంగానికి గౌరవం ఇవ్వకుండా వైకాపా నేతలు అవమానకరంగా ప్రవర్తించడం దారుణం. చట్టాలను సమర్థంగా అమలు చేయాల్సిన నాయకులు స్వయంగా ఉల్లంఘిస్తే, ప్రజలు ఏం నేర్చుకోవాలి?" అని ప్రశ్నించారు. వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తుకు వచ్చిందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ కల్యాణ్ వైకాపా హయాంలో జరిగిన వివిధ వివాదాస్పద ఘటనలను ప్రస్తావించారు:
-ప్రజావేదిక కూల్చివేత
-200 పైచిలుకు ఆలయాల కూల్చివేత
-డాక్టర్ సుధాకర్ మృతి
-జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలు
- సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై వైకాపా నేతల దాడులు
-చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టిన తీరు
-అమరావతి రైతులపై దౌర్జన్యం
-తిరుపతి కల్తీ లడ్డూ వివాదం
-రాష్ట్ర భవిష్యత్తుపై పవన్ ఆత్మవిశ్వాసం
పవన్ కల్యాణ్ తన ప్రసంగం ముగింపులో "ప్రజలు మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు మేము నిబద్ధతతో ఉన్నాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గవర్నర్, న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వని పార్టీకి ఇక స్థానమే లేదు" అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత పెరిగింది. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, అధికార పక్షానికి పెద్ద సవాలు విసిరినట్లుగా అనిపిస్తున్నాయి.