ఎమ్మెల్యేగా నా పని తీరు నచ్చకపోతే...పవన్ సంచలన వ్యాఖ్యలు
పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉపన్యాసం చేశారు.
By: Tupaki Desk | 10 Jan 2025 2:51 PM GMTపిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉపన్యాసం చేశారు. ఒక విధంగా ఆయనలో ఉప ముఖ్యమంత్రి కంటే జనసేన అధినేత మరీ ముఖ్యంగా ఒక విపక్ష నేత కనిపించారు. ఆయన అధికారుల తీరు విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి.
అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ మానేయాలని పవన్ కోరారు. అది తిరుపతి అయినా లేక పిఠాపురం అయినా లేక ఏపీలో ఎక్కడ అయినా సామాన్యులను గుర్తు పెట్టుకోండి సగటు జనానికి మనం సంరక్షణ ఇవ్వడానికే ఉన్నామని గుర్తు చేసుకోండి అని పవన్ చెప్పారు. తాను పనితీరు సరిగా లేకపొతే ఎవరినీ ఉపేక్షించనని స్పష్టం చేశారు.
తాను బాధ్యతగా వ్యవహరిస్తాను అని అదే సమయంలో అధికారులు అంటే గౌరవం ఉందని అన్నారు. తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినే అన్నారు తనకు ఉద్యోగుల కష్టాలు తెలుసు అన్నారు. అంతమాత్రం చేత విధి నిర్వహణలో పొరపాట్లు జరిగితే చూస్తూ ఊరుకోనని అన్నారు. ముఖ్యంగా పోలీసులు తరతమ భేదాలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.
నేరస్థులకు కులాలు లేవని ఆయన అన్నారు. ఫలనా వారిని అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయన్న భయం తనకు లేదని ఆయన అన్నారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. ప్రజల పక్షాన పనిచేయడమే తమ బాధ్యత అన్నారు. తాను పిఠాపురం ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తేనే ఓటు వేయండి అని పవన్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు.
తన ప్రొగ్రెస్ రిపోర్టుని ప్రజలే ఇవ్వాలని ఆయన అన్నారు. అందరికీ హానీమూన్ పీరియడ్ అయిపోయిందని ఆరు నెలల పాలన ముగిసిందని అన్నారు. ఇక మీదట తనతో సహా అంతా ప్రజల కోసం పనిచేసి తీరాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లోకి వచ్చాను అంటే పేరు లేక లేక డబ్బులు లేక కాదని అవన్నీ తనకు సమృద్ధిగా ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్న కోరికతోనే తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాను అన్నారు. తాను ఆ పని చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాను అన్నారు.
కూటమి ప్రభుత్వం మరో పదేళ్ల పాటు కొనసాగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెబుతూనే అధికారులు తీరు మార్చుకోవాలని పవన్ చెప్పడం విశేషం. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు. తిరుమల తొక్కిసలాటలో కేవలం రెండు వేల అయిదు వందల మందిని కంట్రోల్ చేయలేకపోయారు అని ఆయన విమర్శించారు. పదకొండు వందల మంది పోలీసులు ఉండి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి అవగాహన చేసుకోకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
తన శాఖ కాదు కానీ తాను ఉప ముఖ్యమంత్రిగా జరిగిన సంఘటన పట్ల బాధతో తగ్గి క్షమాపణలు చెప్పాను అని పవన్ అన్నారు. టీటీడీ బోర్డు ఎందుకు తగ్గి క్షమాపణలు చెప్పదని ఆయన ప్రశ్నించారు. తాను తగ్గి సారీ చెప్పలేదా అని ఆయన నిలదీశారు.
జరిగిన దానికి క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి రావని కానీ చూసే ప్రజలు అర్ధం చేసుకుంటారని పవన్ అన్నారు. ఈ రోజున 164 సీట్లను ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించకపోతే టీటీడీ బోర్డు ఎక్కడిది పదవులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి పవన్ స్పీచ్ అంతా ఆవేశపూరితంగా సాగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.