తమిళ రాజకీయాల్లోకి జనసేన? పవన్ సంచలన కామెంట్స్
ఓ తమిళ టీవీ చానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను ఏదీ ప్లాన్ చేసుకోనని, జరగాల్సినవి ఏదైనా అలా జరిగిపోతుందని వ్యాఖ్యానించారు
By: Tupaki Desk | 24 March 2025 4:36 PM ISTఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, వైసీపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో విజయం సాధించిన జనసేన విస్తరణ ఆలోచనలో ఉందా? ఏపీలో నిలదొక్కకుంటూనే పక్క రాష్ట్రాలు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవాడానికి సిద్ధమవుతోందా? అంటే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూస్తే అవును అనే చెప్పాల్సివస్తోంది. ఓ తమిళ టీవీ చానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను ఏదీ ప్లాన్ చేసుకోనని, జరగాల్సినవి ఏదైనా అలా జరిగిపోతుందని వ్యాఖ్యానించారు. తమిళ రాజకీయాల్లోకి జనసేన ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన అలా సమాధానం ఇవ్వడంతో ద్రవిడ రాజకీయాలపై జనసేనాని ఆసక్తి చూపుతున్నారా? అన్న ఆసక్తికర ప్రశ్న తలెత్తుతోంది.
జాతీయ రాజకీయాలతోపాటు తమిళ, తెలుగు రాజకీయాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ సినీ నటులు రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ కు మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. మహానటుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తేవడం గొప్ప విషయంగా పవన్ ఆభివర్ణించారు. ఇక తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐడీఎంకే, టీవీకే మధ్య కెమిస్ట్రీ కుదురుతుందో? లేదో? చూడాల్సివుందన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య చక్కని కెమిస్ట్రి కుదరడం వల్లే విజయం సాధించామని చెప్పుకొచ్చారు.
పార్టీని పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీపైనా పవన్ వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ కు అనుభవం ఉందని, తాను ఆయనకు సలహాలివ్వాల్సిన అవసరం లేదన్నారు. సహజంగా ఏర్పడని పొత్తుల వల్ల ప్రయోజనం ఉంటుందో? ఉండదో? చూడాలన్నారు. రాజకీయ లెక్కల కోసం పొత్తు పెట్టుకుంటే ఓట్ల షేరింగు జరుగుతుందా? అనేది అనుమానమేనన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి నాయకుడంటూ పవన్ కితాబునిచ్చారు. పగ తీర్చుకోవాలనే ఆలోచన లేని స్టాలన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రజల ఆలోచన వేరుగా ఉండొచ్చునని పవన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
ఎన్డీఏ భాగస్వామపక్ష నేతగా తాను ఏఐడీఎంకే మళ్లీ తమ కూటమిలో చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎంజీఆర్ స్థాపించిన ఏఐఎండీకే పార్టీ బాగుండాలని ఆకాంక్షించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి ఫళనిస్వామి బలమైన నాయకుడని చెప్పిన పవన్, ఎన్డీఏతో ఏఐఎండీకే పొత్తు పెట్టుకోవడం తప్పేమీ కాదన్నారు. ఇక డీలిమిటేషన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు గొడవ చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం తప్పుపట్టారు. దక్షిణాదిలో సీట్లు తగ్గకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.