బిగ్ సౌండ్ : కాకినాడ తీరంలో దేవర సినిమా చూపించిన పవన్ కళ్యాణ్!
దీంతో ఇపుడు కాకినాడ పోర్టులో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇది ఇపుడు అక్రమార్కులందరిలోనూ కలవరం రేగేలా చేస్తోంది.
By: Tupaki Desk | 30 Nov 2024 3:25 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా సముద్రంలోకి వెళ్ళి మరీ అక్కడ స్మగ్లింగ్ అవుతున్న అక్రమ బియ్యం షిప్ ని చూశారు. అంతే కాదు మొత్తం సీజ్ చేయాలని కూడా అధికారులను అదేశించారు. ఒక మంత్రి కానీ కీలక స్థానాలలో ఉన్న వారు కానీ ఈ స్థాయిలో అవినీతి వెంట పడి నియంత్రించాలని చూడడం అంటే నిజంగా అది గొప్ప విషయంగానే చూడాలి.
ఇక్కడ పవన్ చిత్తశుద్ధిని అంతా అభినందించాలి. ఎందుకంటే పవన్ వారాహి యాత్ర సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో కాకినాడ పోర్టు ఉంచి అక్రమంగా వేల టన్నుల బియ్యం స్మగ్లింగ్ అయి ఇతర దేశాలకు తరలిపోతుందని తీవ్ర ఆరోపణలు చేశారు.
అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో ఇదంతా జరుగుతోందని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం ఇతర దేశాలకు తరలిపోవడం అన్న ఇష్యూని స్టేట్ వైడ్ గా తెలియచేసి దాని వెనక ఉన్న గుట్టుని రట్టు చేసిన వారు పవన్ కళ్యాణ్.
అప్పటిదాకా ఎవరికీ పెద్దగా అది తెలియదు. మేము అధికారంలోకి వస్తే ఈ అక్రమాల గుట్టుని విప్పుతామని అక్రమంగా బియ్యం తరలిపోకుండా చూస్తామని కూడా పవన్ పదే పదే చెప్పారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చింది
కానీ ఎక్కడా ఈ అక్రమ బియ్యం రవాణా అన్నది ఆగలేదు. పైగా పూర్వం పద్దహ్తిలోనే చక్కగా సాగిపోతోంది. ఇపుడు వైసీపీ ప్రభుత్వం లేదు కానీ అక్రమాలు మాత్రం ఆగడంలేదు. మొత్తానికి ఈ వ్యవహారంతో పవన్ కి ధర్మాగ్రహమే వచ్చింది.
అందుకే ఆయన ఢిల్లీలో నాలుగైదు రోజుల పాటు బిజీ షెడ్యూల్ పెట్టుకుని తీరిక లేకుండా గడిపి ఏపీకి వస్తూనే నేరుగా కాకినాడ పోర్టులోకే వెళ్లారు. అక్కడ అక్రంగా స్మగ్లింగ్ చేయబడిన షిప్ ని ఆయన సందర్శించారు.
కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికాకు వెళ్తున్న షిప్ లో ఏకంగా 640 టన్నుల బియ్యం తరలిపోతున్నది గమనించి అధికారులు పట్టుకున్నారు. ఇపుడు దాని మీదనే ఫోకస్ పెట్టిన పవన్ ఇది ఒక భాగం మాత్రమే మొత్తం అవినీతి మూలాలు చాలా లోతుల్లో ఉన్నాయని అక్కడి దాకా వెళ్ళి అంతు తేల్చకపోతే ఈ స్మగ్లింగ్ బియ్యంతో ఆగదని ఏకంగా ఉగ్రవాదులే చొరబడి తీరం నుంచి దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.
పవన్ మీడియా మీటింగ్ పెట్టి ఉప ముఖ్యమంత్రిని అయిన తననే రావద్దు అని మేసెజ్ లను పంపుతున్నారని తాను ఈ తరహా అక్రమాల మీద కలుగచేసుకుంటే ఏకంగా పదివేల మంది ఉపాధి పోతుందని కూడా వారు అంటున్నారని ఇదెక్కడి దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాను కేంద్ర స్థాయిలో ఈ వ్యవహారానికి ముగింపు పలికేలా చూస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనే మాట్లాడుతానని పవన్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన ఈ ఇష్యూలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే కాకినాడ పోర్టు నుంచి ఏకంగా ఎన్నో ఏళ్ళుగా ఈ తరహా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇక్కడ ప్రభుత్వాలతో పని లేదని అంతా అలా జరిగిపోతుందని ఎవరు అధికారంలో ఉన్నా ఇది ఆగకపోవడానికి అదే కారణం అని అంటున్నారు.
దీంతో ఇపుడు కాకినాడ పోర్టులో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇది ఇపుడు అక్రమార్కులందరిలోనూ కలవరం రేగేలా చేస్తోంది. ఎంతటి పెద్ద వారు అయినా తాను వదిలిపెట్టేది లేదు అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అంటే దీనిని బట్టి చూస్తే కూటమి వచ్చిన తరువాత జరుగుతున్న ఈ అక్రమ రవాణా వెనక ఎవరు ఉన్నా తర తమ భేదం లేకుండా శిక్షితామని పవన్ చెబుతున్నారు. దాంతో స్థానికంగా చూస్తే తీవ్ర స్థాయిలో రాజకీయ అలజడి కూడా రేగుతోంది. గొలుసు కట్టు మాదిరిగా ఇది జరిగిపోతోంది. దీంతో ఇపుడు పవన్ ధర్మాగ్రహం ఎవరి మీదకు తెస్తుందో అని అంతా హడలుతున్నారు.
అయితే పవన్ తలచుకుని ఈ విధంగా అవినీతి ప్రక్షాళనకు నడుము బిగించడం మంచి పరిణామమే అని అంటున్నారు. ఈ తరహా రాజకీయాన్ని ప్రజలు కూడా ఎపుడూ చూడలేదు. పవన్ అవినీతిని సహించను అనడమే కాదు ఆచరణలో చూపిస్తున్నారు. మరి ఆయనకు అధికార యంత్రాంగం తో పాటు రాజకీయం కూడా ఎంతవరకూ సహకరిస్తుందో చూడాల్సి ఉంది. ఈ విషయంలో సక్సెస్ అయితే పవన్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు.