Begin typing your search above and press return to search.

'పుష్ప'లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్వాధీనం చేసుకోగా.. అధికారులను పవన్ కల్యాణ్ అభినందించారు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 7:58 AM GMT
పుష్పలను పట్టుకున్న ఫారెస్ట్  అధికారులు.. పవన్  కల్యాణ్  కీలక వ్యాఖ్యలు!
X

ప్రభుత్వాలు ఏవైనా, అధికారులు ఎవరైనా.. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో మాత్రం స్మగ్లర్లు తగ్గేదేలే అన్నట్లుగా పనులు చేస్తుంటే.. తాజాగా ఏపీ ఫారెస్ట్ అధికారులు కూడా తాము అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్వాధీనం చేసుకోగా.. అధికారులను పవన్ కల్యాణ్ అభినందించారు.

అవును... తాజాగా కర్ణాటక రాష్ట్రం హోసకోట, అన్నమయ్య జిల్లాల పరిధిలో ఏపీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో సుమారు రూ.4.20 కోట్ల విలువగల ఆరు టన్నుల 195 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ దాడులకు సంబంధించిన వివారాలను తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు.

ఇందులో భాగంగా... బుధవారం తెల్లవారు జామున అటవీ సిబ్బందితో కలిసి టాస్క్ ఫోర్స్ బలగాలు అన్నమయ జిల్లాలోని వీరబల్లి మండలం సమీపంలో తనిఖీలు చెస్తుండగా.. తమిళనాడుకులోని తిరువన్నామలై జిల్లాకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సమయంలో వీరి నుంచి పది దుంగలు, ఓ కారు, ఓ బైక్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం మేర్కు కర్ణాటక రాష్ట్రం హోసకోట తాలూకా కటిగెనహల్లి సమీపంలోని నీలగిరితోటలో దాచిన 185 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

ఈ సందర్భంగా... 195 ఎర్ర చందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకోవడంలో.. స్మగ్లింగ్ లో పాల్గొన్న 8 మంది నేరస్థులను అరెస్ట్ చేయడంలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన ఏపీ అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

ఇదే సమయంలో... ఈ ఆపరేషన్ మన విలువైన సహజ వారసత్వాన్ని రక్షించడమంలో మన ఎన్ ఫోర్స్ మెంట్ టీం అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఎర్ర చందనం అరుదైన, అమూల్యమైన జాతని.. దాని పరిరక్షణ అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ఈ సమయంలో.. అటవీ నేరాలు ఎదుర్కోవడానికి చేసే అన్ని ప్రయత్నాలను సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వడంలో బలంగా ఉన్నారని పవన్ తెలిపారు.

ఈ క్రమంలో.. ఈ ఆపరేషన్లో కీలక భూమిక పోషించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఎస్పీ, రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్, తిరుపతి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తిరుపతి, తిరుపతి ఎస్పీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.