Begin typing your search above and press return to search.

ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు... నితీశ్ రెడ్డిపై పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్!

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో.. ప్రధానంగా ఇండియన్ క్రికెట్ గురించిన చర్చల్లో నితీశ్ కుమార్ రెడ్డి పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Dec 2024 10:44 AM GMT
ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు... నితీశ్  రెడ్డిపై పవన్  ఇంట్రస్టింగ్ ట్వీట్!
X

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో.. ప్రధానంగా ఇండియన్ క్రికెట్ గురించిన చర్చల్లో నితీశ్ కుమార్ రెడ్డి పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఆసిస్ బౌలర్లను ఎదుర్కొని నిలబడి సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి గురించే ఇప్పుడు చర్చ. ఈ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు.

అవును.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసినప్పుడు క్రికెట్ గురించి తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు, తెలుసనుకునేవాళ్లు కూడా సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్ ఎంపికను వ్యతిరేకిస్తున్నట్లు ఓ మాజీ సెలక్టర్ కామెంట్లు వైరల్ అయ్యాయనే చర్చ నెట్టింట బలంగా జరిగింది.

అయితే.. అద్భుతం జరిగే ముందు ఎవడూ గుర్తించడు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా.. నితీశ్ రెడ్డి ఒక్క సెంచరీతో తన సత్తా చాటాడు. అది కేవలం ఒక సెంచరీ మాత్రమే కాదు.. భారత్ ను అత్యంత భీకర కష్టాల నుంచి గట్టేక్కించే ప్రదర్శనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారు.

ఇందులో భాగంగా.... మీరూ భారత్ లో ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏమి చేశారన్నది ముఖ్యం అని మొదలుపెట్టిన పవన్ కల్యాణ్... టెస్ట్ సెంచరీ చేసిన భారత్ లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్ గా చరిత్ర సృష్టించినందుకు ప్రియమైన నితీశ్ కుమార్ రెడ్డి.. మీరు భారత్ గర్వించేలా చేశారంటూ పవన్ కొనియాడారు.

ఇదే సమయంలో... ఐకానిక్ మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్దర్ – గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో మీరు 114 పరుగుల అద్భుతమైన నాక్ తో ప్రతిభను ప్రదర్శించారని చెప్పిన పవన్.. మీరు మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించాలని.. భారత జెండాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకున్నారు.

అదే విధంగా... యువతకు క్రీడల పట్ల అభిరుచి, దృఢమైన సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తిని ఇవ్వాలని.. ఈ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.