అల్లు అర్జున్ వ్యవహారంపై ప్రశ్న... పవన్ రియాక్షన్ ఇదే!
అవును... గాలివీడు ఘటనలో గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించేందుకు కడప రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ ను విలేకరులు ప్రశ్నించారు!
By: Tupaki Desk | 29 Dec 2024 5:37 AM GMTగత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు, తదనంతర పరిణామాలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. "పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు గత మూడు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పోందుతుండటం తెలిసిందే.
ఇక దీనిపై పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇందులో భాగంగా.. ఈ కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది. బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ అటు చిరంజీవిని, ఇటు నాగబాబును వారి వారి ఇళ్లకు వెళ్లి కలిశారు. తన అరెస్టు, తదనంతర పరిణామాల్లో తనకు సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పినట్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో బెయిల్ పై విడుదలైన ఆయనను మరోసారి విచారించారు పోలీసులు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇది అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్స్ అండ్ బీజేపీ అన్నట్లూ మారిపోయింది. ఇక.. ఏపీలో వైసీపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.. అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారనే చర్చ బలంగా జరిగింది.
దీంతో.. ఎవరు అవునన్నా కాదన్నా.. ఏ కోణంలో చూసినా ఇది హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలని అంటున్నారు. ఈ ఘటన అనంతరం ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. అన్ని సినిమాలకూ టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండదని ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అయితే... ఈ విషయంపై స్పందించడానికి సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించట్లు కనిపించలేదు!
సాధారణంగా గతంలో ‘సినిమా విషయాలు - ప్రభుత్వ నిర్ణయాలు’ అనే అంశాలపై నిత్యం తనదైనశైలిలో స్పందిస్తూ, విశ్లేషణలు చేసిన పవన్.. తాజా విషయంపై మాత్రం ఇప్పటి వరకూ స్పందించన దాఖలాలు లేవనే చర్చ మొదలైంది. ఈ సమయంలో దీనిపై స్పందించాలని అడిగిన విలేఖరిపై పవన్ అసహనం వ్యక్తం చేశారనే విషయం హాట్ టాపిక్ గా మారింది!
అవును... గాలివీడు ఘటనలో గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించేందుకు కడప రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ ను విలేకరులు ప్రశ్నించారు! దీంతో... ఇది సంబంధం లేని ప్రశ్న అన్నట్లుగా సమాధానం చెప్పిన పవన్ కు మరో ప్రశ్న ఎదురైంది.
ఇందులో భాగంగా... "అల్లు అర్జున్ మీ ఫ్యామిలీ మెంబర్ కదా?".. అనే ప్రశ్న ఎదురవ్వగా.. "ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడటం ఏమిటి?" అని ఎదురు ప్రశ్నించారు. ఇంతకంటే పెద్ద విషయాలపై స్పందించాలని అసహనం వ్యక్తం చేశారు! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!